తుగ్లక్ గుర్తుకొస్తుండు!
కేసీఆర్ పాలనపై కోమటిరెడ్డి విసుర్లు
చౌటుప్పల్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు, పాలన చూస్తుంటే పిచ్చి తుగ్లక్ గుర్తుకొస్తున్నాడని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.10 కోట్లతో బస్సు కొన్నారని, రంగు బాగోలేదని రూ.5 కోట్లు ఖర్చు చేసి కార్లు మార్చారని, చైనా పర్యటన కోసం ప్రత్యేక విమానమే తీసుకెళ్లారని ఇవన్నీ చూస్తుంటే తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. సచివాలయాన్ని కూలగొట్టి రూ. వెయ్యి కోట్లతో మళ్లీ నిర్మిస్తామని, ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనం కడతామనడం శోచనీయమని పేర్కొన్నారు.
వాస్తు పేరుతో ఎన్ని వేషాలు వేసినా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేరన్నారు. మాటలతో గారడి చేయడం కేసీఆర్‌తోపాటు ఆయన కూతురు, కుమారుడు, మేనల్లుడికి దేవుడిచ్చిన వరమని ఎద్దేవా చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే ముఖ్యమంత్రి ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రైతులను భిక్షగాళ్లుగా మారుస్తున్నారని చెప్పారు. దొరల పాలన అంతమయ్యే రోజు త్వరలోనే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో కాంగ్రెస్ రైతురాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకంతో ప్రతి పేద కుటుంబానికి ఉచిత వైద్యం అందించారని, ఈ పథకాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోరుుందని పేర్కొన్నారు.