డిసెంబరులోగా కుప్పానికి కృష్ణా జలాలు | krishna weter comming kuppam at desember | Sakshi
Sakshi News home page

డిసెంబరులోగా కుప్పానికి కృష్ణా జలాలు

Published Tue, Aug 9 2016 12:27 AM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM

మొక్కకు నీరు పోస్తున్న సీఎం చంద్రబాబు - Sakshi

మొక్కకు నీరు పోస్తున్న సీఎం చంద్రబాబు

– రాష్ట్రమంతా పశువులకు దాణా భద్రత
– త్వరలో మగాళ్ల తాగుడుకి తాళాలు 
– బెల్టుషాపులు పెట్టి మద్యం అమ్మితే ఉపేక్షించం
– రాష్ట్రంలో ఈ ఏడాది 7 వేల అంగన్‌వాడీ భవనాలు
– కుప్పంలో అత్యాధునిక ఈఎస్‌ఐ ఆస్పత్రి
– బంద్‌ల పేరుతో బస్సుల జోలికి రాకుండా చట్టం
– ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నా
– కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబునాయుడు 
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి,/ కుప్పం 
 
డిసెంబరులోగా కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. హంద్రీనీవా పనుల వేగాన్ని పెంచి డిసెంబరు మూడో వారంలో కుప్పానికి నీరందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కుప్పం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు కమతమూరు, సామగుట్టపల్లి క్రాస్‌ల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రమంతా పశుదాణా భద్రత కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అజోలా,సైలేజ్, పచ్చగడ్డిలతో కూడిన దాణా మిశ్రమాన్ని మిక్స్‌డ్‌ ఫీడ్‌గా తయారుచేసి పశుపోషకులకు అందజేయడం ద్వారా మంచి ప్రయోజనాలు కనిపించే వీలుందన్నారు. దీనివల్ల పాలదిగుబడి రెట్టింపయ్యే వీలుందని శాస్త్రీయంగా గుర్తించామన్నారు. ఈనేపథ్యంలో 50 శాతం సబ్సిడీతో ఇంటికే దాణా సరఫరా చేసేందుకు యోచిస్తున్నామన్నారు. రాష్ట్రమంతా గొర్రెలు, ఫౌల్ట్రీ పెంపకాలతో పాటు హార్టికల్చర్, సెరీకల్చర్‌ రంగాల అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 7 వేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. రేపో, ఎల్లుండో రెండో విడత డ్వాక్రా రుణమాఫీ కోసం నిధులు విడుదలు చేయనున్నామన్నారు. ఈసారి డ్వాక్రా మహిళలు మాఫీ సొమ్మును వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. మగాళ్ల తాగుడు వల్ల వేల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్న సీఎం చంద్రబాబు తాగుబోతులైన భర్తలకు తిండిపెట్టడం మానేస్తే గానీ దారికి రారని మహిళలకు సూచించారు. త్వరలో మగాళ్ల తాగుడికి తాళాలు వేయాల్సిన అవసరముందనీ, ఆ దిశగానే తాను యోచిస్తున్నానన్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ షాపులను ధ్వంసం చేయండని మహిళామణులకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎకై ్సజ్‌ అధికారులనూ వదలననీ, తప్పు చేస్తే ఉద్యోగం గోవిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 
 
ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నా...
ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతూనే ఉన్నాన ని సీఎం పునరుద్ఘాటించారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందే వరకూ హోదా అవసరమన్న విషయాన్ని కేంద్రం దగ్గర ప్రస్తావిస్తూనే ఉన్నానన్నారు. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు తనను ఇబ్బంది పెట్టలేవన్నారు. తన హయాంలో బంద్‌లు, ధర్నాలను సహించబోనన్నారు. వీలైతే రైల్వేచట్టాలను లె చ్చి బంద్‌ల రూపేణా ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల జోలికి పోకుండా చేయాల్సిన అవసరముందన్నారు. బస్సుల జోలికెళ్తే చేతులు కాలేలా ప్రత్యేక చట్టం తేవాల్సి ఉందన్నారు. పట్టిసీమ పనులకు రాక్షసుల్లా అడ్డుపడ్డ వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మొన్నటికి మొన్న రాత్రిపూట పోలవరం కుడికాల్వకు గండి పెట్టారని ఆరోపించారు. దొరికితే వీళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. 
 
కుప్పంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గానికి వరాలు ప్రకటించారు.గతంలో ఇచ్చిన హామీల సంగతి ప్రస్తావించకుండానే కొత్త వాగ్దానాలను గుప్పించారు. కుప్పం పరిసరాల్లో ఉండే అసంఘటిత కార్మికుల ప్రయోజనార్థం త్వరంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించనున్నామన్నారు. అదేవిధంగా రూ.10 లక్షలతో కార్మిక భవన్‌ నిర్మాణం, రెస్కో ఉద్యోగులకు హెల్త్‌కార్డులు అందజేస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కమతమూరు, సామగుట్టపల్లి క్రాస్, శాంతిపురం మండలాల్లో పర్యటించి రూ.2.40కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీఎం వెంట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు తలారి మనోహర్, అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీటీడీ ఛైర్మన్‌ చదలవాడ కష్ణమూర్తి, జెడ్పీ ఛైర్మన్‌ గీర్వాణి చంద్రప్రకాశ్, కలెక్టర్‌ సిద్ధార్థజైన్, సబ్‌కలెక్టర్‌ కృతికాభాత్రాలు ఉన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement