వియ్యంకుడి కోసం విచిత్ర నైజం
వియ్యంకుడి కోసం విచిత్ర నైజం
Published Fri, Feb 17 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
- ఎన్నికల ముందు ఢోకా లేదన్నారు
- అధికారం చేజిక్కాక వందల కుటుంబాలకు అన్యాయం
- వియ్యంకుడికి పోలవరం కాలువ పనులు దక్కడమే కారణం
- తమ స్వార్థం కోసం ఇంత మోసమా
- భగ్గుమంటున్న బాధితులు
సాక్షిప్రతినిధి, కాకినాడ :‘ఒడ్డు దాటే వరకూ ఓడ మల్లన్న...ఒడ్డు దాటాక బోడి మల్లన్న’ చందంగా తునిలో అ«ధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తుని నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యనమల కృష్ణుడు పోటీచేశారు. కృష్ణుడు గెలుపు కోసం ఆయనకు వరుసకు సోదరుడైన ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అప్పట్లో ఎడాపెడా హామీలు గుప్పించేశారు. అందులో తుని రూరల్ మండలం కుమ్మరిలోవ కాలనీ వాసులకు ఇచ్చిన హామీ కూడా ఉంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం కుమ్మరికాలువ కాలనీ తొలగించాలని ప్రతిపాదించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ కాలనీకి వచ్చిన సోదరులు తెలుగుదేశం పార్టీకి పట్టకండితే కాలనీ తొలగించాల్సిన అవసరం లేకుండా ఎలైన్‌మెంట్ మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ కాలనీలో 500 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నాయి. కాలనీ చెక్కు చెదరదన్న యనమల సోదరులు ఇచ్చిన హామీ అమలు చేస్తారనే నమ్మకంతో ఇంతకాలం ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రామకృష్ణుడు ఆర్థిక మంత్రి అయ్యారు. ఇక తమ కాలనీకి ఏ ఢోకా ఉండదని భావించారు.
అధికారంలోకి వచ్చాక...
ఎన్నికలైపోయి టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.కుమ్మరిలోవ వాసులకు ఇచ్చిన హామీ అమలు చేయాలంటే అమాత్యునికి బంధుత్వం అడ్డువచ్చింది. కాలనీ తొలగించకుండా చూస్తామన్న హామీ ఓ పక్క, స్వయానా రామకృష్ణుడి వియ్యంకుడుకి పోలవరం ఎడమ కాలువ పనుల టెండర్ దక్కడంతో కుమ్మరి కాలనీ వాసుల ఆశలు అడియాసలయ్యాయి. పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పరిధిలో 95–96 కిలోమీటర మధ్య కాలువ నిర్మాణానికి పెద్ద కొండ అడ్డంగా ఉంది. ప్రస్తుత ఎలైన్‌మెంట్ ప్రకారం కట్రాళ్లకొండ మీదుగా తాండవ నదిపై నుంచి షుగర్ ఫ్యాక్టరీ కొండపైకి 400 మీటర్లు ఆక్విడెక్టు నిర్మాణానికి కొండను తొలిచే పనులు మొదలు పెట్టారు. ఇందుకు రూ.40 కోట్లు పైనే ఖర్చు అవుతుంది. ఈ సందర్బంగా కంట్రాళ్లకొండ, కుమ్మరిలోవ కొండలను బాంబులతో పేల్చి మట్టిని తొలగించాలి. ఆ సందర్భంగా కొండపై నుంచి బండరాళ్లు కుమ్మరిలోవ కాలనీలో ఇళ్లపై పడి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకోసమే కాలనీ మొత్తాన్ని ఖాళీ చేయిస్తున్నామంటున్నారు. నష్టపరిహారంగా రూ.25 కోట్లు, దుద్దిక మెట్ట ప్రాంతంలో 27 ఎకరాలు భూసేకరణకు చేసి ఇళ్ల స్థలాలు, అక్కడ మౌలిక వసతులు కల్పనకు మరో రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మొత్తంగా సుమారు రూ.100 కోట్లు వెచ్చించాలి.
ఇలా చేస్తే ఎవరికీ నష్టం ఉండదు...
ఎలైన్‌మెంట్ మారిస్తే తమకు ప్రయోజనం ఉంటుందని కుమ్మరిలోవ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. కుమ్మరిలోవ కాలనీ కొండ ప్రారంభంలో ఎడమవైపు నుంచి నేరుగా తాండవ నదిపై నుంచి షుగర్ ఫ్యాక్టరీ కొండపైకి 800 మీటర్ల నుంచి కిలో మీటరు మేర ఆక్విడెక్టు నిర్మిస్తే కాలనీవాసులను తరలించాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఇందుకు రూ.70 నుంచి రూ.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఖర్చు కూడా తక్కువ అవుతుందంటున్నారు. ఆర్థిక మంత్రి యనమలకున్న పలుకుబడి ముందు ఈ ఎలైన్‌మెంట్ మార్పు పెద్ద విషయం కానేకాదంటున్నారు. కానీ స్వయానా వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పనులు చేపడుతుండటంతో ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని మంత్రి యనమల గాలికొదిలేశారని కుమ్మరిలోవ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందేమో కాలనీకి ఏమీ ఇబ్బంది కలగకుండా చూస్తామని నమ్మించి ఇప్పుడు కాలనీని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. కేవలం వియ్యంకుడు చేస్తున్న పనులకు ప్రతిబంధంక కలిగించకూడదనే ఏకైక లక్ష్యంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి కాలనీని ఖాళీ చేయిస్తున్నారని, తమకు ఇచ్చిన హామీ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నారు. పనులు చేస్తున్నది మంత్రి వియ్యంకుడు కావడంతో స్థానిక టీడీపీ నాయకులు కూడా పెదవి విప్పడం లేదు. 1986లో టీడీపీ ప్రభుత్వంలో ఇదే మంత్రి రామకష్ణుడు హాయంలోనే కుమ్మరిలోవ కాలనీలో బలహీనవర్గాలకు ఇళ్లు నిర్మించడం గమనార్హం. స్థానికులంతా కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే వారే. అయినా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు కన్నీరుపెట్టుకుంటున్నారు. తునిలో కృష్ణుడుని ఓడించారనే అక్కసుతోనే ఇచ్చిన హామీని గాలికొదిలేసి తమను రోడ్డున పడేస్తున్నారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement