
సౌదీలో ఉద్యోగం పేరుతోమాయలేడి మోసం
♦ తమ కుమార్తెను సౌదీలో సేఠ్‌లకు విక్రయించిందని
♦ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
♦ ఇండియాకు రప్పించాలని వేడుకోలు
♦ విచారించి న్యాయం చేస్తానన్న ఎర్రగుంట్ల సీఐ
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మహాత్మానగర్ కాలనీకి చెందిన షకీల విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మహిళలను సౌదీ, కువైట్, దుబాయి లకు తీసుకెళ్లి సేఠ్‌లకు విక్రయిస్తోందని బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన నూర్జహాన్, హైదర్‌వలి దంపతులు శనివారం ఎర్రగుంట్ల సీఐ రాజేంద్రప్రసాద్‌ను కలిసి సౌదీలో నరకం అనుభవిస్తున్న తమ కూతురు ఫరీదాను ఇండియాకు తీసుకురావాలని వేడుకున్నారు. బాధితుల కథనం మేరకు.. దంపతుల చిన్న కూతురు ఫరీదా డిగ్రీ వరకు చదివింది. అక్కడే ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిది.
వీరి కుమారుడు అనంతపురంలోని ఆర్డీటీలో చదువుకుంటూ క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు ఎర్రగుంట్లకు వచ్చేవాడు. ఆ సమయంలో షకీల కుమారుడు పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో షకీల వీరి ఇంటికి వెళ్లి తాను విదేశాలకు ఏజెంటుగా పనిచేస్తూ అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తుంటానని నమ్మబలికింది. మీ కూతురిని కూడా సౌదీకి పంపండ ని చెప్పింది. పలుమార్లు ఆమెతో సంబంధమున్న ఈశ్వరయ్య అనే వీఆర్‌వోను వెంట తీసుకుని కారులో వీరి ఇంటికి వచ్చి ఒత్తిడి చేసింది. వీరి కుటుంబ పరిస్థితి సరిగా లేకపోవడంతో కూతురిని సౌదీకి పంపేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఫరీదాతో పాటు వీరిని ఆమె ఢిల్లీకి తీసుకెళ్లింది. అక్కడి నుంచి సౌదీకి పంపింది.
అక్కడ ఇళ్లలో పాచి పనులు చేసేందుకు పంపగా సేఠ్‌లు తన పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫరీదా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విలపించింది. ఇండియాకు రావాలని వారి నుంచి తప్పించుకొని వస్తే సేఠ్‌లు అక్కడి పోలీసులకు అప్పగించారని, ఆ తర్వాత వారే స్టేషన్ నుంచి విడిపించుకుని తీసుకెళ్లి తాము చెప్పినట్లు వినకపోతే ఇక్కడే చంపి ఇండియాకు శవాన్ని పార్సిల్ చేస్తామని బెదిరించారు. వారంరోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచి నరకం చూపించారని ఫరీదా తన బాధను ఫోన్‌లో చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది.
ఏజెంట్ షకీలపై సీఐకి ఫిర్యాదు
సౌదీలో నరకం అనుభవిస్తున్న తమ కుమార్తెను ఇండియాకు పిలిపించాలని ఏజెంట్ షకీలాను అడిగితే సౌదీకి వెళ్లింది ఏదో ఒక పని చేసేందుకు కదా, అక్కడ పాచి పనులతో పాటు ఇతర పనులు చేయాల్సిందేని బెదిరిస్తోందని వీరు వాపోయారు. అనంతపురం ఎస్పీని కలిసి విన్నవించుకుంటే ఆయన ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు పంపించారని తెలిపారు. దీనిపై విచారణ చేస్తామని సీఐ రాజేంద్రప్రసాద్ వారికి చెప్పారు.