ఇసుక కోసం భూ దందా
ఇసుక కోసం భూ దందా
Published Sat, Sep 17 2016 5:35 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
* మూడెకరాలు ఇతరుల పేరిట నమోదు
* ప్రయోగం చేసిన రెవెన్యూ అధికారి
* వాటా కోసం తెలుగు తమ్ముళ్ల లాలూచీ
సర్వే నంబరు 660... కొల్లిపర మండలం మున్నంగి గ్రామ పరిధిలోని ఈ సర్వే నంబరు అంటే ఇప్పుడు ఆ మండలంలోనే కాక డివిజన్ స్థాయిలోనూ రెవెన్యూ అధికారులు హడలిపోతున్నారు. విత్‌హెల్డ్‌లో ఉన్న ఈ సర్వే నంబరుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగవు. అయినా ఇటీవల మూడెకరాల పొలాన్ని అధికారులు చేతివాటంతో ఇద్దరికి కేటాయించారు. అధికారులందరూ జాతీయ జెండా ఆవిష్కరణలు, పుష్కర విధుల్లో బిజీగా ఉండగా, ఓ అధికారి మాత్రం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూదందాకు పాల్పడ్డాడు.
తెనాలి రూరల్: కొల్లిపర మండలం మున్నంగి గ్రామ పరిధిలో సర్వే నంబరు 660 కింద 147.4 ఎకరాలు ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ సర్వే నంబరులోని పొలాల్లో కొంత మేర సాగు భూమి ఉండగా, మిగిలిన భూమి ఇసుకమేట. మీ భూమి పోర్టల్‌లో మొత్తం 147.4 ఎకరాల్లో రికార్డుల పరంగా 58 మంది పేరున 110.46 ఎకరాలు ఉన్నాయి. మిగిలిన 36.94 ఎకరాలు ఇతరులు అని పొందుపరచి ఉంది. సుమారు రెండేళ్ల క్రితం కొందరు తమ భూమి అన్యాక్రాంతమవుతోందని, తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌లో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సర్వే నంబరును విత్‌హెల్డ్ జాబితాలో చేర్చారు. ఈ భూములను సాగుచేస్తున్న సుమారు 30 మంది అడంగల్, పట్టాదారు పుస్తకం, భూమి కొలతల మార్పులు చేర్పులు, పేర్లు సరి చేయాలంటూ దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు.
మీ భూమి పోర్టల్‌లో మాయ చేశారు...
ఈ నేపథ్యంలో ఆగస్ట్ 15వ తేదీన 660 సర్వే నంబరులోని భూమికి సంబంధించి ఇద్దరి పేరున మూడెకరాలు ఉన్నట్టు మీ భూమి పోర్టల్‌లో మార్పు జరిగింది. యల్లమాటి భూషణం(ఖాతా నంబరు 100116) పేరిట ఒక ఎకరం, కేఎస్ కుమారి(ఖాతా నంబరు 100117) పేరున రెండెకరాలుగా నమోదు చేశారు. అంటే 58గా ఉన్న సాగుదారులు 60కి పెరిగారు. ఏడాదిన్నరగా విత్‌హెల్డ్‌లో ఉన్న సర్వే నంబరు భూమిలో లావాదేవీలకు ఆస్కారం లేదని తెలిసిందే. అలాంటపుడు ఒకేరోజు మూడెకరాల భూమిని ఇద్దరి పేర్లతో చేర్చి, మళ్లీ విత్‌హెల్డ్‌లో వుంచడమంటే ఉన్నతాధికారుల నోటీసు లేకుండా జరిగివుండదనే భావన వ్యక్తమవుతోంది.
ఇసుక కోసమే.?
నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఇసుకను తవ్వుకుని సొమ్ము చేసుకునేందుకే ప్రధానంగా ఈ దందాకు పాల్పడినట్టు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరంలో ఇసుక తవ్వి అమ్ముకుంటే ఖర్చులన్నీ పోను సుమారు రూ.10 లక్షల వరకు మిగులుతాయి. అందుకోసమే మూడెకరాలను ప్రస్తుతానికి ఇద్దరి పేరున నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మా పేర్లూ చేర్చు.. చర్యలుండవు...
ఈ పకడ్బందీ దందా ఎలాగో మొత్తానికి బయటకు పొక్కింది. కొత్తగా నమోదు చేసిన పేర్లను తీసివేసి, తిరిగి విత్‌హెల్డ్ కొనసాగేలా చేద్దామన్న ఆలోచనలో సదరు అధికారి ఉండగా, కొందరు తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. ‘అయ్యిందెలాగూ అయింది.. మాపేర్లు కూడా చేర్చు.. చర్యలు లేకుండా మేము చూస్తాం..’ అని భరోసా ఇచ్చారని తెలుస్తోంది.
నేను కొత్తగా వచ్చా... విచారణ చేస్తాం...
నేను ఆగస్ట్ 10వ తేదీన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, 26వ తేదీ వరకు నాకు డిజిటల్ సైన్ రాలేదు. భూ దందాకు సంబంధించిన వ్యవహారం నా దృష్టికి రాలేదు. విచారిస్తాను.
– సీహెచ్‌వీ రమణమూర్తి, తహసీల్దారు
Advertisement
Advertisement