శాఖల మధ్య స్థలవివాదం
శాఖల మధ్య స్థలవివాదం
Published Wed, Feb 1 2017 9:50 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
మాదంటే మాది అంటున్న ఆర్టీసీ, ఇరిగేషన్
పరిశీలన చేసి నివేదికకు ఆదేశించిన జేసీ
అన్నవరం : అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ పక్కన గల ఖాళీ స్థలం వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. అన్నవరం నడిబొడ్డులో మెయిన్‌రోడ్ పక్కన గల ఈ స్థలం రూ.కోట్లు విలువ చేస్తుంది. ఈ స్థలంపై ఆర్టీసీ, ఇరిగేషన్ శాఖల మధ్య వివాదం నెలకొనడంతో ఖాళీ స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఆ స్థలం తమదేనని ఆర్టీసీ అధికారులు అంటుండగా కాదు అది ఇరిగేషన్‌శాఖదని ఎవరికీ బదలాయించలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ స్థలం పై రెండు శాఖల మధ్య వివాదం ఏర్పడింది. పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, శంఖవరం తహసీల్దార్ వెంకట్రావు తదితరులు జేసీ వెంట ఉన్నారు. ఈ స్థలం వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వమని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జేసీ ఆదేశించారని ఆర్డీఓ ‘సాక్షి’కి తెలిపారు.
ఆర్టీసీ లీజుకు ఇవ్వడంతో మొదలైన వివాదం
ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి 2000 సంవత్సరంలో ఇరిగేషన్ శాఖ, అన్నవరం దేవస్థానం నుంచి సేకరించిన 2.38 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి అప్పగించారు. అందులో ఎకరం స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది. మిగతా స్థలం ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థలంలో హోటల్ నిర్మాణం నిమిత్తం ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు గతేడాది స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఓ కాంట్రాక్టర్‌కు 43 సంవత్సరాలు లీజుకు అప్పగించారు. ఆ స్థలంలో హోటల్ నిర్మాణానికి ఆ కాంట్రాక్టర్ శంకుస్థాపన చేయడంతో ఇరిగేషన్ శాఖ అభ్యంతరం చెప్పింది. ఆ స్థలం తమదేనని ఆర్టీసీకి అప్పగించలేదని తెలిపింది. దీంతో ఆ హోటల్ నిర్మాణం ఆగిపోయింది. తనకు ఆర్టీసీ స్థలం అప్పగించలేదని కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించడంతో మళ్లీ ఈ వ్యవహారం వెలుగు చూసింది.
మాకు అప్పగించినట్టు రికార్డు ఉంది
ఆ ఖాళీ స్థలాన్ని తమకు అప్పగించినట్టు రికార్డులు ఉన్నాయి. అప్పుడు అప్పగించి ఇప్పుడు ఇవ్వలేదని ఇరిగేషన్ అధికారులు అంటే చెల్లదు. దీనిపై వివరణ ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు.
- డీఎస్‌ఎన్ రాజు, ఈఈ, ఆర్టీసీ
ఆ స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించలేదు
ఆ స్థలాన్ని రెవెన్యూశాఖకు ఇరిగేషన్ శాఖ అప్పగించలేదు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని అప్పగించినట్టు చెబితే అందుకు మేం భాద్యులం కాదు. ఈ వివాదంపై సంయుక్త పరిశీలన నిర్వహించమని జేసీ ఆదేశించినందున మా వద్ద ఉన్న రికార్డుల ప్రకారం నివేదిక అందజేస్తాం.
- ఇరిగేషన్ డీఈ శేషగిరిరావు
Advertisement
Advertisement