దేవుడికే ద్రోహం! | Land Kabza In rajayyapeta | Sakshi
Sakshi News home page

దేవుడికే ద్రోహం!

Published Thu, Jul 28 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

Land Kabza In rajayyapeta

విశాఖపట్నం: అది నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం.. ఆ గ్రామ పరిధిలో సముద్రతీరానికి ఆనుకుని సర్వేనెం 288/1లో 19 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి చెరువు సరోజనమ్మ పేరుతో నమోదై ఉంది. సుమారు 80 ఏళ్ల క్రితమే ఆ భూమిని సరోజనమ్మ గ్రామంలోని రామాలయానికి దానంగా ఇచ్చేశారు.  అçప్పటి నుంచి దాన్ని గ్రామస్తులే సాగు చేస్తూ వచ్చిన ఆదాయంతో ప్రతి ఏటా శ్రీరామనవమి, నూకతాత, నూకాలమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సాగు లీజును గ్రామపెద్దలే నిర్ణయించేవారు. 1960 నుంచి 1990 వరకు జంపన లక్షణరాజు, లక్ష్మీపతిరాజులు ఆ భూములను లీజుకు తీసుకుని ఆదాయాన్ని  గ్రామస్తులకు చెల్లించేవారు. 1990లో గ్రామానికి చెందిన పూజారి పిక్కి అప్పన్నను ఆలయ ధర్మకర్తగా నియమించారు. అప్పటి నంచి ఆయన ద్వారా లీజు వసూలు చేస్తూ పండగలు నిర్వహించేవారు.

కాగా 2000 నుంచి 2015 వరకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పిక్కి రాంబాబు, దైలపల్లి ముత్యాలు, పిక్కి కాశీరావు తదితరులు ఈ భూములను సాగుచేసి ఏడాదికి రూ.1.40 లక్షలు గ్రామస్తులకు ఇచ్చేవారు. 2015–16 సంవత్సరానికి గాను గ్రామానికి చెందిన పూడి అప్పాయ్యమ్మకు లీజుకు ఇచ్చారు. ఇలా 1960 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా నిర్విరామంగా గ్రామస్తులే సాగుచేసుకుంటూ వచ్చారు. రికార్డుల్లో సరోజనమ్మ పేరున ఉన్న ఈ భూములకు సంబంధించిన వారుసులెవరూ ఇన్నేళ్లుగా గ్రామానికి రాలేదు. అటువంటి వారెవరూ లేరని కూడా గ్రామస్తులు చెబుతున్నారు.


 
పాసు పుస్తకాలున్నా సరే..
వాస్తవానికి 30 ఏళ్ల క్రితమే అధికారులు ఆ భూములను దేవుడి మాన్యంగా చూపిస్తూ రాముల వారి తరఫున పాసుపుస్తకాలు (తోక పుస్తకాలు) జారీ చేశారు. ఇక 1990లో గ్రామపెద్దలు నియమించిన ధర్మకర్త పిక్కి అప్పన్న రాముల వారి పేరిట  ప్రభుత్వానికి భూమి పన్ను కూడా చెల్లించారు. ఈ ఆధారాలన్నీ  గ్రామస్తుల వద్ద ఉన్నాయి. భూములు లీజుకు తీసుకున్న వారి వద్ద ఆ లీజు ఒప్పంద పత్రాలు కూడా కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలున్నా సరే.. అధికారం తలకెక్కిన సదరు పచ్చనేతకు అవేవీ కనపించడం లేదు. ఎవ్వరినీ లెక్కచేయడం లేదు. తను చెప్పినట్లు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే రికార్డులు కూడా మార్చేయాలని ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. నెల్లూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఆ భూములను కట్టబెట్టి పరిహారంలో సగం సగం కొట్టేయాలన్నదే సదరు నేత వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జిరాయితీ భూములకు పరిహారం చెల్లించే ప్రక్రియ మొదలైంది. చాలామందికి ఎకరాకు రూ.18 లక్షల చొప్పున చెల్లించారు. టీడీపీ నేత ఒత్తిడి మేరకు రాములోరి భూములకు కూడా పరిహారం చెల్లించేందుకు అధికారులు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
 
అడకత్తెరలో అధికారులు
వారసుడని చెప్పుకుంటున్న వ్యక్తిగానీ, అతని కుటుంబ సభ్యులుగానీ ఈ భూములను సాగు చేస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పాసు పుస్తకాలు కోసం అతను చేసిన దరఖాస్తును తొలుత తిరస్కరించారు. అయితే టీడీపీ నేత ఆదేశాలతో రికార్డులు మార్చే పనిలో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికారులు ఓ సాకు చూపిస్తున్నారు. భూములు ఎవరివైనా..  సాగులోగానీ, అనుభవంలోగానీ ఉన్న వారి పేర్లు అడంగల్‌(సాగుబడిలెక్క)లో నమోదు చేయాలి.  అయితే 80 ఏళ్లుగా రామాలయ భూములను గ్రామస్తులే సాగుచేస్తున్నా వారిపేర్లు ఎక్కడా అనుభవదార్లుగా నమోదు కాలేదు. ఇప్పుడు ఇదే సాకుతో ఆ భూమి గ్రామస్తులకు చెందదని అధికారులు తేల్చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే దేవుడిమాన్యంగా రామాలయం పేరిట ఉన్న భూములను తిరిగి చెరువు సరోజనమ్మ పేరిట మార్చినట్టు సమాచారం. సరోజనమ్మ పేరిట మార్చడం ద్వారా వారసుడంటూ తెరిపైకి వచ్చిన వ్యక్తికి కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, పరిహారం కోసం దేవుడి భూములను కొట్టేసే కుట్రను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఆ భూముల ఫలసాయంతో ఎన్నాళ్ల నుంచో ఏటేటా రాములోరి, అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆ భూములు పోతే పరిస్థితేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
రికార్డులు ఎలా మారిపోతాయ్‌
రాములోరి భూములను పదిహేనేళ్లుగా సాగుచేస్తూ శిస్తు గ్రామాభివద్ధికి చెల్లిస్తున్నాము.  పరిహారం కోసం ఈ భూములను కాజేయాలని కొంతమంది కుట్ర పన్నారు. ఎనభై ఏళ్లుగా ఈ భూములు దేవుడి మాన్యంగా ఉన్నాయి.. ఇప్పటికిప్పుడు రికార్డులు ఎలా మారిపోతాయి.   
– పిక్కి రాంబాబు, మాజీ సర్పంచ్‌
 
అధికారులు న్యాయంగా ఆలోచించాలి
ఇరవై ఏళ్లపాటు ఈ భూములను సాగుచేసి శిస్తు దేవుడి పండగల కోసం చెల్లించాను. మా తాతల కాలం నుంచి ఈ భూములు దేవుడి మాన్యంగా ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది వచ్చి అవి తమవేనని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అధికారులు న్యాయం చేయాలి. పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి దేవుడికి అన్యాయం చేయొద్దని మనవి.
 –  దైలపల్లి ముత్యాలు, లీజుదారుడు
 
అర్ధంతరంగా వారసుడొచ్చాడు
విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూములు సేకరిస్తూ భారీగా పరిహారం చెల్లిస్తుండటంతో పచ్చనేత కన్ను ఈ రామాలయం భూములపై పడింది. ఎలాగైనా ఆ పరిహారం కొట్టేయాలని ప్లాన్‌ వేశారు. అంతే.. అర్ధంతరంగా సరోజనమ్మ వారసుడంటూ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చారు. ఆ భూమిపై సర్వ హక్కులు  అతనివేనని, భూములను ఎవరికి దానం చేయలేదని భూసేకరణలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం సుమారు నాలుగు రూ.కోట్లు అతనికే దక్కాలంటూ అధికారులకు సిఫారసు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement