nakkapalli
-
ప్రభంజనంలా సీఎం జగన్ బస్సు యాత్ర నక్కపల్లి
-
ఇక్కడ పెట్రోల్ ఫ్రీ
-
రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్‌ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్‌ఏవోబీ (నేవల్ ఆల్టర్నేనేటివ్ బేస్)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ) -
200 కిలోల గంజాయి పట్టివేత
నక్కపల్లి: జాతీయరహదారిపై కాగిత టోల్గేట్ వద్ద గురువారం తెల్లవారు జామున పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఎస్ఐ డి.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఉదయం వాహనాలను తనిఖీలో భాగంగా విశాఖనుంచి తమిళనాడు వైపు వెళ్తున్న లారీలో కేబిన్, సీటు పైభాగంలో 100 ప్యాకెట్లలో ఉన్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా గోరిమేడుకు చెందిన డ్రైవర్ మహ్మద్ యూసుఫ్, క్లీనర్ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మోతుగూడెం చెక్‌పోస్టు వద్ద గంజాయి స్వాధీనం మోతుగూడెం: మోతుగూడెం పోలీస్‌స్టేషన్ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో గంజాయి స్వాదీనం చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ నుంచి సమాచారం మేరకు చింతూరు అడిషన్ ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో చింతూరు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో ఎస్ఐ సత్తిబాబు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. సింధువాడ గ్రామంలో జహీరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒక ఇన్నోవా వాహనాన్ని ,మోటార్ బైక్‌ను, 350 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. -
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
నక్కపల్లి: మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. రాజయ్యపేటలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. ఆ ప్రాంతంలో ఆటలాడుకుంటున్న పిల్లలు పిడుగు శబ్దానికి భయపడి పరుగులు తీశారు. ఈ దృశ్యాన్ని కొందరూ వీడియోలో చిత్రీకరించారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదు
సాక్షి, విశాఖపట్నం: భూములిచ్చిన ఏ ఒక్క రైతుకూ పరిహారం విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. విశాఖ జిల్లాలోని నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై బుధవారం రాజయ్యపేట వద్ద ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డితో పాటు నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారి షేక్ సుభాన్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తో పాటు స్థానికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక పార్కు ఏర్పాటును స్వాగతించారు. పర్యావరణ కాలుష్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ పరిహారానికి సంబంధించి ఇంకా కొందరికి బకాయిలు చెల్లించాల్సి ఉందని.. కొన్నిచోట్ల ఇళ్లకు, చెట్లకు తక్కువ పరిహారమిచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారికి కూడా నష్టపరిహారమివ్వాలని కోరారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి జేసీ హామీ ఇచ్చారు. నక్కపల్లి మండలంలో భూ సేకరణ జరిగిన బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట గ్రామాల్లో పరిహారం సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. -
మహిళ కానిస్టేబుల్ మృతి, పలు అనుమానాలు
సాక్షి, విశాఖపట్నం: నక్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అదే స్టేషన్లో పనిచేస్తున్న భవాని అనే మహిళ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్త నాగల సింహాద్రి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవాని 2018లో నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విధుల్లోకి చేరింది. భవానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: దారుణం : బిడ్డల గొంతుకోసిన తండ్రి -
పోరాడాలే గానీ ప్రాణాలు తీసుకోవద్దు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం విశాఖ జిల్లా నక్కపల్లిలో త్రినాథ్ ప్రాణత్యాగానికి పాల్పడటంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. త్రినాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన లక్ష్యం కోసం పోరాడుదామని, ఆత్మహత్య లాంటి తీవ్ర చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఇంజక్షన్ వికటించి మహిళ మృతి
నక్కపల్లి(పాయకరావుపేట) : గొడిచర్ల పీహెచ్సీలో ఇంజక్షన్ వికటించి ఓ మహిళ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలుఇలా ఉన్నాయి. ఎస్.రాయవరం మండలం గోకుల పాడుకు చెందిన కొఠారు నాగమణి(24) తన స్నేహితురాలు నానేపల్లి విజయతో కలసి సోమవారం ఉదయం గొడిచర్ల పీహెచ్‌సీకి వచ్చింది. తనతో తెచ్చుకున్న ఇంజక్షన్‌ను చేయాలని అక్కడ ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్ రూపను కోరింది. అయితే ఇంజక్షన్ చేసేందుకు రూప నిరాకరించింది. బతిమాలడంతో ఆమె నాగమణికి ఇంజక్షన్ చేసింది. కొద్దిసేపటికి నాగమణి సృహతప్పిపడిపోయింది. వెంటనే రూప, నాగమణి స్నేహితురాలు విజయ ఆమెకు మంచినీరు పట్టి, సపర్యలు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఆమె మరణించిందని తనకు విజయ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిందని మృతురాలికి వరుసకు సోదరుడైన లంక రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి ఒత్తిడి మేరకు తాను ఇంజక్షన్ చేసినట్టు రూప చెబుతోంది.అయితే ఇంజక్షన్‌ను మక్కకు చేయాల్సి ఉండగా చేతికి చేయడం వల్లే వికటించి మరణించినట్టు పీహెచ్సీ వైద్యాధికారి నాగనరేంద్ర తెలిపారు.కాగా మృతురాలు కొద్ది రోజులుగా హృద్రోగంతో బాధపడుతోంది. తరచూ ఇంజక్షన్లు చేయించుకుంటోంది.దీనిలో భాగంగానే స్నేహితురాలితోకలసి గొడిచర్ల వచ్చి అక్కడ ఇంజక్షన్ చేయమని కోరిందని, ముందు నిరాకరించిన ట్యాబ్‌టెక్నీషియన్ రూప తర్వాత చేసిందని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో ఉన్న సమయంలో హృద్రోగంతో బాధపడుతున్న రోగికి ఆయన అనుమతి తీసుకోకుండా ఇంజక్షన్ చేయడం నేరమని తెలుస్తోంది. నక్కపల్లి సీఐ సీహెచ్ రుద్రశేఖర్ పీహెచ్‌సీకి వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. -
నక్కపల్లిలో 62 కేజీల గంజాయి పట్టివేత
నక్కపల్లి : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్గేట్ వద్ద పోలీసుల తనిఖీలో 62 కేజీల గంజాయి పట్టు బడింది. జి.మాడుగుల నుంచి తమిళనాడులోని వేలూరుకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడికే ద్రోహం!
విశాఖపట్నం: అది నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం.. ఆ గ్రామ పరిధిలో సముద్రతీరానికి ఆనుకుని సర్వేనెం 288/1లో 19 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి చెరువు సరోజనమ్మ పేరుతో నమోదై ఉంది. సుమారు 80 ఏళ్ల క్రితమే ఆ భూమిని సరోజనమ్మ గ్రామంలోని రామాలయానికి దానంగా ఇచ్చేశారు. అçప్పటి నుంచి దాన్ని గ్రామస్తులే సాగు చేస్తూ వచ్చిన ఆదాయంతో ప్రతి ఏటా శ్రీరామనవమి, నూకతాత, నూకాలమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సాగు లీజును గ్రామపెద్దలే నిర్ణయించేవారు. 1960 నుంచి 1990 వరకు జంపన లక్షణరాజు, లక్ష్మీపతిరాజులు ఆ భూములను లీజుకు తీసుకుని ఆదాయాన్ని గ్రామస్తులకు చెల్లించేవారు. 1990లో గ్రామానికి చెందిన పూజారి పిక్కి అప్పన్నను ఆలయ ధర్మకర్తగా నియమించారు. అప్పటి నంచి ఆయన ద్వారా లీజు వసూలు చేస్తూ పండగలు నిర్వహించేవారు. కాగా 2000 నుంచి 2015 వరకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పిక్కి రాంబాబు, దైలపల్లి ముత్యాలు, పిక్కి కాశీరావు తదితరులు ఈ భూములను సాగుచేసి ఏడాదికి రూ.1.40 లక్షలు గ్రామస్తులకు ఇచ్చేవారు. 2015–16 సంవత్సరానికి గాను గ్రామానికి చెందిన పూడి అప్పాయ్యమ్మకు లీజుకు ఇచ్చారు. ఇలా 1960 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏటా నిర్విరామంగా గ్రామస్తులే సాగుచేసుకుంటూ వచ్చారు. రికార్డుల్లో సరోజనమ్మ పేరున ఉన్న ఈ భూములకు సంబంధించిన వారుసులెవరూ ఇన్నేళ్లుగా గ్రామానికి రాలేదు. అటువంటి వారెవరూ లేరని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. పాసు పుస్తకాలున్నా సరే.. వాస్తవానికి 30 ఏళ్ల క్రితమే అధికారులు ఆ భూములను దేవుడి మాన్యంగా చూపిస్తూ రాముల వారి తరఫున పాసుపుస్తకాలు (తోక పుస్తకాలు) జారీ చేశారు. ఇక 1990లో గ్రామపెద్దలు నియమించిన ధర్మకర్త పిక్కి అప్పన్న రాముల వారి పేరిట ప్రభుత్వానికి భూమి పన్ను కూడా చెల్లించారు. ఈ ఆధారాలన్నీ గ్రామస్తుల వద్ద ఉన్నాయి. భూములు లీజుకు తీసుకున్న వారి వద్ద ఆ లీజు ఒప్పంద పత్రాలు కూడా కూడా ఉన్నాయి. ఇన్ని ఆధారాలున్నా సరే.. అధికారం తలకెక్కిన సదరు పచ్చనేతకు అవేవీ కనపించడం లేదు. ఎవ్వరినీ లెక్కచేయడం లేదు. తను చెప్పినట్లు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే రికార్డులు కూడా మార్చేయాలని ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు. నెల్లూరు నుంచి తీసుకొచ్చిన వ్యక్తికి ఆ భూములను కట్టబెట్టి పరిహారంలో సగం సగం కొట్టేయాలన్నదే సదరు నేత వ్యూహంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జిరాయితీ భూములకు పరిహారం చెల్లించే ప్రక్రియ మొదలైంది. చాలామందికి ఎకరాకు రూ.18 లక్షల చొప్పున చెల్లించారు. టీడీపీ నేత ఒత్తిడి మేరకు రాములోరి భూములకు కూడా పరిహారం చెల్లించేందుకు అధికారులు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అడకత్తెరలో అధికారులు వారసుడని చెప్పుకుంటున్న వ్యక్తిగానీ, అతని కుటుంబ సభ్యులుగానీ ఈ భూములను సాగు చేస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పాసు పుస్తకాలు కోసం అతను చేసిన దరఖాస్తును తొలుత తిరస్కరించారు. అయితే టీడీపీ నేత ఆదేశాలతో రికార్డులు మార్చే పనిలో ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు అధికారులు ఓ సాకు చూపిస్తున్నారు. భూములు ఎవరివైనా.. సాగులోగానీ, అనుభవంలోగానీ ఉన్న వారి పేర్లు అడంగల్(సాగుబడిలెక్క)లో నమోదు చేయాలి. అయితే 80 ఏళ్లుగా రామాలయ భూములను గ్రామస్తులే సాగుచేస్తున్నా వారిపేర్లు ఎక్కడా అనుభవదార్లుగా నమోదు కాలేదు. ఇప్పుడు ఇదే సాకుతో ఆ భూమి గ్రామస్తులకు చెందదని అధికారులు తేల్చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేవుడిమాన్యంగా రామాలయం పేరిట ఉన్న భూములను తిరిగి చెరువు సరోజనమ్మ పేరిట మార్చినట్టు సమాచారం. సరోజనమ్మ పేరిట మార్చడం ద్వారా వారసుడంటూ తెరిపైకి వచ్చిన వ్యక్తికి కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, పరిహారం కోసం దేవుడి భూములను కొట్టేసే కుట్రను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ భూముల ఫలసాయంతో ఎన్నాళ్ల నుంచో ఏటేటా రాములోరి, అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ఆ భూములు పోతే పరిస్థితేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ఎలా మారిపోతాయ్ రాములోరి భూములను పదిహేనేళ్లుగా సాగుచేస్తూ శిస్తు గ్రామాభివద్ధికి చెల్లిస్తున్నాము. పరిహారం కోసం ఈ భూములను కాజేయాలని కొంతమంది కుట్ర పన్నారు. ఎనభై ఏళ్లుగా ఈ భూములు దేవుడి మాన్యంగా ఉన్నాయి.. ఇప్పటికిప్పుడు రికార్డులు ఎలా మారిపోతాయి. – పిక్కి రాంబాబు, మాజీ సర్పంచ్ అధికారులు న్యాయంగా ఆలోచించాలి ఇరవై ఏళ్లపాటు ఈ భూములను సాగుచేసి శిస్తు దేవుడి పండగల కోసం చెల్లించాను. మా తాతల కాలం నుంచి ఈ భూములు దేవుడి మాన్యంగా ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది వచ్చి అవి తమవేనని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. అధికారులు న్యాయం చేయాలి. పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి దేవుడికి అన్యాయం చేయొద్దని మనవి. – దైలపల్లి ముత్యాలు, లీజుదారుడు అర్ధంతరంగా వారసుడొచ్చాడు విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం ఈ ప్రాంతంలో భూములు సేకరిస్తూ భారీగా పరిహారం చెల్లిస్తుండటంతో పచ్చనేత కన్ను ఈ రామాలయం భూములపై పడింది. ఎలాగైనా ఆ పరిహారం కొట్టేయాలని ప్లాన్ వేశారు. అంతే.. అర్ధంతరంగా సరోజనమ్మ వారసుడంటూ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చారు. ఆ భూమిపై సర్వ హక్కులు అతనివేనని, భూములను ఎవరికి దానం చేయలేదని భూసేకరణలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం సుమారు నాలుగు రూ.కోట్లు అతనికే దక్కాలంటూ అధికారులకు సిఫారసు చేస్తున్నారు. -
బస్సు - లారీ ఢీ : నలుగురికి గాయాలు
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి టోల్గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆ రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నక్కపల్లి వద్ద ఆటో బోల్తా: 17 మందికి గాయాలు
నక్కపల్లి (విశాఖపట్నం) : విశాఖ జిల్లా నక్కపల్లి ఏరియా ఆసుపత్రి సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం గంగవరం గ్రామానికి చెందిన 13 మంది రాజమండ్రి పుష్కరాలను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులకు నక్కపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పొట్టకూటికోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
- రైలునుంచి జారిపడి తండ్రీకొడుకుల దుర్మరణం - మృతులు విజయనగరం జిల్లా దినసరి కూలీలు - గుల్లిపాడు రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన నక్కపల్లి: విధి బలీయమైనది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువకు చెందిన అగతాని వెంకటరావు కుటుంబం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పొట్టకూటికోసం వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తూ మరో నాలుగు గంటల్లో సొంతూరుకి చేరుకునే సమయంలో వెంకటరావు, కొడుకు నవీన్ రైలు నుంచి జారిపడి దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే భర్త అందివచ్చిన కొడుకు చనిపోవడాన్ని భార్య బంగారమ్మ జీర్ణించుకోలేకపోతోంది. మతి స్థిమితం కోల్పోయిన దానిలా మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఫోన్లో బంధువులకు వివరాలు చెప్పడానికి కూడా ఆమె నోటి మాట రావడంలేదు. ఇది అక్కడివారినందరినీ కంటతడి పెట్టిం చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుల్లిపాడు రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రైలునుంచి జారిపడి తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన అగతాని వెంకటరావు(47) ముగ్గురు పిల్లలు, భార్యతోకలసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని జొన్నాడలోని ఇటుకల తయారీ పరిశ్రమలో పనికి రెండు నెలల క్రితం వెళ్లారు. అక్కడ పనులు ముగిశాక స్వగ్రామానికి వస్తూ బుధవారం రాత్రి రాజమండ్రిలో రెలైక్కారు. రద్దీగా ఉండడంతో భార్య, ఇద్దరు పిల్లల్ని కంపార్టుమెంటు మధ్యలో కూర్చోబెట్టి వెంకట్రావు, పెద్ద కొడుకు నవీన్(17) గేటు వద్ద కూర్చున్నారు. తెల్లవారుజాము కావడంతో నిద్రమత్తులో వెంకటరావు కుమారుడు నవీన్(17) జారిపడ్డాడు. అతడ్ని రక్షించే ప్రయత్నంలో వెంకట్రావు కూడా పడిపోయాడు. ఈ ఘటనలో ఇరువురి మృతదేహాలు తునాతునకలయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా తయారయ్యా యి. రైలులోని వారు ఈ విషయం భార్య బంగారమ్మకు చెప్పడంతో ఆమె తనవద్ద ఉన్న ఇద్దరు చిన్నపిల్లలతో నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్లో దిగి తుని రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. గుల్లిపాడు స్టేషన్ సిబ్బంది ఈ ఘటనపై తుని రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. జీఆర్పీ ఎస్ఐ వై. రాంబాబు సంఘటన స్థలానికి చేరుకుని తెగిపడిన తండ్రీకొడుకుల మృతదేహాలను పరి శీలించారు. వాటిని పోస్టుమార్టానికి తు ని ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద సెల్‌ఫోన్, రాజమండ్రి నుంచి విజ యనగరానికి తీసుకున్న రైలు టికెట్లు ఉన్నాయి. సెల్‌ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలి పారు. నిద్రమత్తులో ప్రమాదవశాత్తూ జారిపడినట్లు తెలుస్తోందన్నారు. -
ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్
నక్కపల్లి (విశాఖపట్నం): గిఫ్ట్‌డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం తీసుకుంటూ నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు శుక్రవారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... రాంబిల్లికి చెందిన లక్ష్మీనర్సింహకు ఉపమాకలో రెండు ఎకరాలభూమి ఉంది. ఈ ఆస్తిని తన సోదరి విజయలక్ష్మి కూతురు సునీత పేరున గిప్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు గురువారం సబ్‌రిజిస్ట్రార్‌ను సంప్రదించాడు. మార్కెట్ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, దానితోపాటు రూ. 10వేలు మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడినా.. ఇస్తేనే రిజిస్ట్రేషన్ అని రిజిస్ట్రార్ స్పష్టం చేశాడు. చేసేది లేక బాధితుడు ఒప్పుకున్నాడు. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు బాధితుడికి నగదు ఇచ్చి పంపించారు. ఉదయం 11గంటలకు 10వేల రూపాయలు ఇవ్వగా టేబుల్ సొరుగులో పెట్టాలని రిజిస్ట్రార్ సూచించారు. ఆయన చెప్పిన ప్రకారం డబ్బు సొరుగులో పెట్టిన అనంతరం రిజిస్ట్రార్ అక్కడ ఉన్న యర్రా సత్తిబాబుని పిలిచి.. రూ.10వేల నగదు ఉందో లేదో చూడాలన్నాడు. సరిచూసిన అనంతరం ఆ సొమ్మును కొత్త సందీప్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. నగదు సందీప్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. లంచంతీసుకున్న సబ్‌రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుతోపాటు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న యర్రా సత్తిబాబు, కొత్త సందీప్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
చిరంజీవితో 150వ సినిమాకు కథ కోసం ప్రయత్నిస్తున్నా
విశాఖ : మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలన్న కోరిక ఉందని ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి తన మనసులో మాటను బయటపెట్టాడు. అందుకు సరైన కథ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వినాయక్ అక్కడ విలేకర్లతో మాట్లాడాడు. మహేష్ బాబు హీరోగా వచ్చే ఏడాది ఓ సినిమా నిర్మిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మరో ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు తీసే యోచన ఉందన్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో అదుర్స్ 2 కూడా తీయనున్నట్లు చెప్పాడు. భూ విక్రయానికి సంబంధించిన పని మీద వినాయక్ రావటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. అతడిని చూసేందుకు, కలిసి ఫోటోలు తీయించుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. -
సెల్ఫోన్లు ఉన్నాయి -మరుగుదొడ్లు లేవు!
విశాఖపట్నం: డ్వాక్రా మహిళల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయిగానీ, వారి ఇళ్లలో మరుగు దొడ్లు మాత్రం లేవని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. జిల్లాలోని నక్కపల్లిలో జరిగిన డ్వాక్రా మహిళల సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ఫోన్లు ఉన్నవారు చేతులు ఎత్తాలని అడిగారు. చాలా మంది చేతులు ఎత్తారు. కొద్ది మంది మాత్రం చేతులు ఎత్తలేదు. దాంతో సెల్ఫోన్లు లేని డ్వాక్రా మహిళలకు త్వరలో సెల్ఫోన్లు ఇస్తామని చెప్పారు. ఆ తరువాత తమ ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నవారు చేతులెత్తాలని అడిగారు. చాలా తక్కువ మంది మాత్రమే చేతులు ఎత్తారు. దాంతో సెల్ఫోన్లు ఉన్నాయి గానీ, మరుగుదొడ్లు మాత్రం లేవన్నారు. వచ్చే అయిదేళ్లలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర ఉండాలన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే అభివృద్ధి సాధ్యం అని చెప్పారు. మహిళా శక్తి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. అభివృద్ధిలో కేసిఆర్‌తో పోటీపడటానికి సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. గతంలో చాలా మంది తనతో పోటీపడటానికి ప్రయత్నించారని చెప్పారు. అయితే ఎవరూ పోటీపడలేకపోయారన్నారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, దాంతో ఆదాయం పెరిగిందని చెప్పారు. అభివృద్ధిలో పోటీపడటం మంచిదేనన్నారు. -
జనం గుండెచప్పుడు
-
బాబులా అబద్దాలు చెప్పం-హామీలు నెరవేరుస్తాం: విజయమ్మ
విశాఖపట్నం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులాగా తాము అబద్దాలు చెప్పం అని, ఇచ్చిన హామీలు నెరవేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం విజయమ్మ విశాఖ జిల్లాలోకి ప్రవేశించారు. నక్కపల్లి మండలం గుడిచర్ల వద్ద నీటమునిగిన పొలాలను పరిశీలించారు. వరహానది ప్రవాహాన్ని చూశారు. వరదబాధితులను పరామర్శించారు. విజయమ్మ ఎదుట బాధితులు తమ బాధను వెళ్లబోసుకున్నారు. అధైర్యపడవద్దని, సహాయం అందే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని బాధితులకు చెప్పారు. అనంతరం విశాఖ చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్జిడీ రైతులకు వర్తించేలా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. రైతులకు ఏ రకమైన సహాయం అవసరమో ఆ రకమైన సహాయం అందించేందుకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం అయ్యవారిపల్లెలో మంగళవారం తెల్లవారుజామున కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే విశాఖపట్నం జిల్లాలోని నక్కపల్లి మండలం గొడిచర్ల జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఆ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని విశాఖ నగరంలోని కింగ్ జార్జీ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో మినీ బస్సు బోల్తా పడింది. ఆ మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే బాధితులంతా హైదరాబాద్ వాసులే.