సర్కారీ భూ‘దందా’ నిగ్గు తేల్చండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా అత్యంత విలువైన భూములను ప్రభుత్వం అత్తెసరు ధరలకే ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తుండటాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆక్షేపించారు. విశాఖ జిల్లా మధురవాడలో రూ.336 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐఐసీకి చెందిన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు.
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సుప్రీంకోర్టు 2012 ఫిబ్రవరి 2న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములు కేటాయించే సమయంలో ప్రజా ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని.. సర్కారుకు లాభం చేకూరేలా సమర్థత కలిగిన సంస్థలకే ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించిందని ఆ లేఖలో వివరించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు లేకుండా విలువైన భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపమెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకే లీజుకు ఇవ్వవచ్చు. కానీ, 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. భూ కేటాయింపులను పరిశీలిస్తే ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. వీటిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.