-
ధర్మపురిలో మూడు, కాళేశ్వరంలో 15 ఘాట్లు
-
నిధులివ్వని సర్కారు.. కానరాని కనీస ఏర్పాట్లు
-
కృష్ణా పుష్కరాలపైనే అందరి దృష్టి
కాళేశ్వరం/ధర్మపురి : గోదావరి అంత్యపుష్కరాలపై సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆది పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించిన సర్కారు అంత్య పుష్కరాలను పూర్తిగా విస్మరించింది. ఆది పుష్కరాల్లో కోట్లాది రూపాయల నిధులతో వివిధ పనులు చేపట్టగా, అంత్య పుష్కరాల్లో భక్తులకు కనీస వసతులు కరువయ్యాయి. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించిన సర్కారు గోదావరి అంత్య పుష్కరాలపై శీతకన్ను వేసినట్టు తెలుస్తోంది. అంత్య పుష్కరాలపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన కూడా చేయకపోడం గమనార్హం. జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇటీవల రెండుసార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
గతేడాది జూలై 14 నుంచి 25 వరకు గోదావరి నది ఆది పుష్కరాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. జిల్లాలోని ధర్మపురి, రాయపట్నం, గోదావరిఖని, మంథని, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అయితే సరిగా ఏడాది తర్వాత అంత్య పుష్కరాలను నిర్వహించడం ఆనవాయితీ కాగా.. ఆదివారం నుంచి ఆగస్టు 11 వరకు వీటిని నిర్వహించనున్నారు. అంత్య పుష్కరాల్లో స్నానమాచరించనా ఆది పుష్కరాల్లో స్నానమాచరించినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. జిల్లాలో ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరంలో అంత్య పుష్కరాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో కోటిలింగాలలోని పుష్కఘాట్లతో మెట్లు కూడా మునిగిపోవడంతో అక్కడ రద్దు చేశారు. ఇక ధర్మపురిలోని మూడు ఘాట్లు, కాళేశ్వరంలోని 15 ఘాట్ల వద్ద మాత్రమే అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. వీటితో ఆది పుష్కరాలు నిర్వహించిన పలు ప్రాంతాల్లో సైతం అంత్య పుష్కరాల కోసం స్థానిక అధికారులు నామమాత్రంగా ఏర్పాటు చేశారు ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో, గోదావరినది వద్ద వేదపండితులు ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారు. గోదావరి మాతకు పూలు, వస్త్రాలు, సుగంధ ధ్రవ్యాలు సమర్పిస్తారు. ప్రతి రోజు సాయంత్రం 5–6 గంటలకు గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహిస్తారు.
కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు రద్దు
ఆదివారం నుంచి అంత్య పుష్కరాలు పూర్తయ్యే వరకు కాళేశ్వరం ఆలయంలో నిత్యపూజలు రద్దు చేసినట్లు ఈవో డి.హరిప్రకాశ్‌రావు తెలిపారు. ఆగస్టు 3 నుంచి శ్రావణమాసం ఆరంభమవుతుండటంతో అభిషేక పూజలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. రూ.50 ప్రత్యేక దర్శనానికి టిక్కెట్లు ఉన్నట్లు తెలిపారు. కాళేశ్వరానికి చెందిన స్థానికులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రెండు గంటలపాటు ఉచిత దర్శనాలు కల్పిస్తామన్నారు. ధర్మపురిలో నిత్యపూజలు యథావిధంగా నిర్వహిస్తారు.
రోజుకో దానం..
1 వెండి, భూమి, బంగారం, ధాన్యం తోచినంత సమర్పించి హిరణ్య శ్రాద్ధం చేయాలి.
2 గోవులు, లవణము, మణులు, వస్త్రములు
3 అశ్వము, గడము, ఫలము, శాకములు
4 తైలము, ఆజ్యము, క్షీరము, తేనే, పానకము
5 ధాన్యము, నాగలి, వృషభము, మహిషము
6 ఘనసారము, కస్తూరి చందనము, ఔషధము
7 గృహము, శయ్య, పీట, ఊయల
8 శ్రీచందనము, కందమూలములు, పుష్పములు
9 దాసీ జనము, కంబలము
10 ముత్యాలహారము, వెండి పుష్పములు
11 పుస్తకము, తాంబూలము, యజ్ఞోపవీతము
12 షోడష మహాదానములు, అమశ్రాద్ధము చేయవలయును.
అంత్య పుష్కరాల వసతులు అంతంత మాత్రమే
గోదావరి తీరంలోని సంతోషిమాతా ఆలయం వద్ద వీఐపీ ఘాట్‌ను ఏర్పాటు చేశారు. మంగలిగడ్డ, సోమవిహార్ ఘాట్‌ల వద్ద భక్తుల స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశారు. డీఎల్‌పీవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఘాట్ల వద పిచ్చిమొక్కలు తొలగింపు పనులు చేపట్టారు. భక్తులు దుస్తులు మార్చుకొనుటకు డ్రెస్సింగ్ రూంలు, పది వరకు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఘాట్ల వద్ద విద్యుత్‌లైట్లు, సౌండ్ సిస్టంను ఏర్పాటు చేశారు. దేవస్థానంలో గతంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. కొత్తగా ఇసుక స్తంభం నుంచి దేవాలయం వరకు క్యూలైన్లను ఏర్పాటుకు ఇనుప స్తంభాలు ఏర్పాటు చేసినా, జాలీలు అమర్చలేదు. కాళేశ్వరంలో ఎలాంటి ఏర్పాట్లు చేపట్టలేదు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు గానీ, తాత్కాలిక మరుగుదొడ్లు గానీ, తాగునీటి వసతితోపాటు వైద్యశిబిరం తదితర ఏర్పాట్లు కనిపించడం లేదు.