- జిల్లా ఎస్పీ రవిప్రకాష్
శాంతిభద్రతలపైనే అభివృద్ధి ఆధారం
Published Thu, Jun 22 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
అనపర్తి:
జిల్లా ప్రజలు శాంతికాముకులని, జిల్లాలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని బదిలీపై పశ్చిమ గోదావరికి వెళ్తున్న జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అన్నారు. అనపర్తిలో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయాన్ని ఆయన గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఒక ప్రాంతం అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉన్న శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందన్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు ఇక్కడ ఉండబట్టే శాంతిభద్రతలు అదుపులో ఉంటున్నాయన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత పోలీసులపై ఉందని, ఆ విధంగానే తాను కృషి చేసినట్లు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆస్తినష్టం కలగకుండా కృషి చేయడంలో తాను కృత్యుడనైనట్లు తెలిపారు. కొన్ని దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నా..ప్రాణ నష్టం కలగకుండా చూశామన్నారు. అవినీతికి తావులేకుండా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విధి నిర్వహణ కొనసాగించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ కార్యాలయాలను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, అడిషనల్ ఎస్పీ దామోదర్, డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, సీఐ శీలబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అనంతరం ఎస్పీని ఉచితరీతిన సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రి ధర్మారెడ్డి(దొరబాబు), ఎంపీపీ తేతలి ఉమామహేశ్వరి, అడిషనల్ ఎస్పీ దామోదర్, ట్రైనీ ఏఎస్పీ అజిత, జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీలు ఆర్.విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, మండపేట సీఐలు లక్ష్మణరెడ్డి, గీతాకృష్ణ, రామచంద్రపురం సీఐ కె.శ్రీధర్‌కుమార్, ఎస్సైలు పి.దొరరాజు, ఎన్.రజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement