మళ్లీ ఇక్కడికే..!
కమిషనరేట్‌ను వీడని పలువురు ఏసీపీలు
అధికార పార్టీ నేతల సిఫారసులతో పోస్టింగ్‌లు
తాజా బదిలీలపై పోలీసు శాఖలో చర్చ
వరంగల్ : మూడు రోజుల క్రితం జరిగిన డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలపై పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. జనవరి 21న రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది డీఎస్పీల బదిలీలు జరిగాయి. వరంగల్ కమిషరేట్ పరిధిలో నలుగురు డీఎస్పీ(ఏసీపీ)ల పోస్టింగ్‌లు మారాయి. డీఎస్పీ స్థాయి అధికారులకు సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్‌లు ఇస్తారు. మన జిల్లాలో కొందరు ఏసీపీలు మాత్రం వరంగల్ కమిషరేట్ పరిధిలోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వం అవసరం కొద్దీ ఇతర జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చినా వీరు మళ్లీ ఇక్కడికే వస్తున్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఇదే స్పష్టమైంది. ఇన్నాళ్లు వరంగల్ కమిషరేట్‌లోనే పనిచేసిన పలువురు మళ్లీ ఇక్కడిక్కడే పోస్టింగ్‌లు పొందారు. ఇతర జిల్లాలకు బదిలీ చేస్తే... నెలల్లోనే మళ్లీ ఇక్కడికి వచ్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ‘అంగీకారం’తోనే తాజా డీఎస్పీల బదిలీలు జరిగినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలకు, పోలీసు వర్గాలకు మధ్య పలువురు వ్యాపార వర్గాలు అనుసంధానకర్తలుగా వ్యవహరించారనే చర్చ సైతం జరుగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన పలువురు డీఎస్పీలను ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. ఇలా బదిలీ అయిన వారు తాజాగా మళ్లీ ఇక్కడికే చేరుకున్నారు.
డీఎస్పీల తాజా బదిలీల్లో ఎస్.ఎం.సురేంద్రనాథ్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ పొందారు. నెల క్రితం వరకు సురేంద్రనాథ్ వరంగల్‌లోనే పనిచేశారు. సరేంద్రనాథ్ 2014 నవంబరులో వరంగల్ డీఎస్పీ(ఏసీపీ)గా నియమితులయ్యారు. ఆయనను డీజీపీకి అటాచ్ చేస్తూ 2016 నవంబరులో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా మళ్లీ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పోస్టింగ్ పొందారు. సురేంద్రనాథ్ పోస్టింగ్ కోసం మరో డీఎస్పీని మూడు రోజుల్లోనే బదిలీ చేశారు. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీగా పి.సంజీవరావును నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. సురేంద్రనాథ్ కోసం తాజాగా సంజీవరావును మూడు రోజుల్లోనే స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీగా బదిలీ చేసింది. సంజీవరావు అంతకుముందు వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే పరకాల డీఎస్పీగా ఎక్కువ కాలం పనిచేశారు.
తాజా బదిలీల్లో మామునూరు ఏసీపీగా పోస్టింగ్ పొందిన పి.శోభన్‌కుమార్ సర్వీసు మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే సాగుతోంది. 2013లో డీఎస్పీగా పదోన్నతి పొంది మహబూబాబాద్ ఎస్‌డీపీవోగా పోస్టింగ్ పొందారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత హన్మకొండ డీఎస్పీ(ఏసీపీ)గా నియమితులయ్యారు. జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో ప్రభుత్వం శోభన్‌కుమార్‌ను కొత్తగూడెం జిల్లా ఓఎస్‌డీగా నియమించింది. త్వరలో పదోన్నతి పొందనున్న భోభన్‌కుమార్‌ను ప్రభుత్వం ముందుగానే అడిషనల్ ఎస్పీ స్థాయి పోస్టింగ్ ఇచ్చింది. మూడున్నర నెలల్లోనే శోభన్‌కుమార్ మళ్లీ బదిలీపై వరంగల్ కమిషరేట్ పరిధిలోకే వచ్చారు.
వరంగల్ కమిషరేట్‌లో క్రైం విభాగం డీఎస్పీ(ఏసీపీ)గా పనిచేసే ఈశ్వరరావును ప్రభుత్వం డిసెంబరులో బదిలీ చేసి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. ఈశ్వరరావు అక్కడ విధుల్లో చేరి సెలవు పెట్టారు. తాజా బదిలీల్లో మళ్లీ వరంగల్ కమిషరేట్ పరిధిలో పోస్టింగ్ పొంది వర్ధన్నపేట ఏసీపీగా నియమితులయ్యారు.