కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి
‘మల్లి’ సాహసానికి గుర్తింపుపై సోదరి దొరసానమ్మ
సంగం(నెల్లూరు): పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు సాహసానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆయన సోదరి డాక్టర్ దొరసానమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు. మస్తాన్‌బాబు ప్రథమ వర్థంతి ఏర్పాట్ల కోసం ఆదివారం స్వగ్రామమైన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీజనసంఘానికి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మస్తాన్‌బాబు మృతి తర్వాత ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నగదు, రెండెకరాల భూమి ఇచ్చిందన్నారు.
అయితే, ఆయన సాహసాన్ని గుర్తించే అవార్డు ఇచ్చే విషయం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ పుట్టి ఉంటే అక్కడి ప్రభుత్వాలు ఇప్పటికే మస్తాన్‌బాబు సాహసానికి తగిన అవార్డు ప్రకటించేవన్నారు. ఎవరెస్టు అధిరోహించిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు అక్కడి సీఎం కేసీఆర్ రూ.25 లక్షల ప్రోత్సాహాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. మస్తాన్‌బాబు ప్రథమ వర్థంతి సందర్భంగా స్వగ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు వకృ్తత్వ, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.