ఉసురు తీసిన అప్పు
కౌలు రైతు ఆత్మహత్య
వల్లూరు: మండలంలోని దిగువపల్లెకు చెందిన బడేమియా బంగారు షావలీ(25 అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దిగువపల్లెకు చెందిన షావలీ కుటుంబానికి గ్రామంలో దాదాపు 5 ఎకరాల పొలం వుంది. అయితే వరుస కరువులతో పంటలు సరిగా పండక పోవడంతో కుటుంబం అప్పుల పాలయింది. దాదాపు 5 ఏళ్ల నుంచి మామిడి తోటలను లీజుకు తీసుకుని అప్పుల నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో గతేడాది సిద్దవటం మండలంలోని జ్యోతి సమీపంలో మామిడి తోటలను మూడేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాడు. గతేడాది తెగుళ్లతో పూత పిందె లేక తీవ్రంగా నష్టం వచ్చింది. ఈ ఏడాదైనా కాపు వుంటే గట్టెక్కవచ్చని అనుకున్నాడు. మామిడి తోటలోనే కొంత కాలంగా తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని కుటుంబంతో కలిసి కాపురం ఉంటున్నాడు. అయితే ఈ ఏడాది కూడా గ్రామంలోని పొలంలో సాగు చేసిన కంది పంట వర్షాభావంతో దెబ్బతినడంతో తీవ్రంగా నష్టాపోయాడు. దీనికి తోడు కౌలుకు తీసుకున్న మామిడి తోటలో పూత , పిందె ఆశాజనకంగా కనిపించక పోవడంతో నష్టాలు తప్పవని భావించాడు.
రుణమాఫీ వర్తించక...
పెట్టుబడి కోసం రూ. 5 లక్షలకు పైగా అప్పు చేశాడు. వడ్డీలతో కలిపి రుణభారం భారీగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో అప్పు ఎలా తీర్చాలని ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బతికి అవమానాల పాలు కావడం కంటే చావడమే మేలని నిర్ణయించుకున్నాడు. తోటలోనే విషపు గుళికలు మింగాడు. ఈ సంఘటనను గమనించిన ఆయన భార్య మహబూబ్‌బీ 108కు ఫోన్ చేశారు.
108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, బాధితుడిని వాహనం ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతదేహానికి స్వగ్రామమైన దిగువపల్లెలో బంధువులు శుక్రవారం అతని భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇతనికి భార్య మహబూబ్‌బీ, అలీ మహమ్మద్(5), మాబూ హుసేన్(3) అనే ఇద్దరు కుమారులు వున్నారు. వీరితోపాటు వృద్ధులైన తల్లి , పెద్దమ్మ ఉన్నారు. కుటుంబానికి ఆధారమయిన షావలీ మరణంతో వారు వీధిన పడినట్లైందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ చలిస్తున్నారు.