కౌలు రైతు బలవన్మరణం
- మిరప సాగులో నష్టాలు
- శనగ మాత్రలు మింగి ఆత్మహత్య
- తమ్మడపల్లెలో విషాదం
బనగానపల్లె రూరల్: మిరప సాగులో నష్టాలు రావడంతో బనగానపల్లె మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు ఆదిమూల బాలన్న(57) బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలన్న మూడెకరాలను రూ.60వేలకు కౌలుకు తీసుకుని మిరప పంట సాగుచేశాడు. పంట దిగుబడి 70 క్వింటాళ్లు వచ్చింది. ఈ పంటను అమ్మేందుకు నాలుగు రోజుల క్రితం గుంటూరు మిర్చియార్డుకు తీసుకు వెళ్లారు. అక్కడ ఆశించిన ధర లభించకపోవడంతో గిడ్డంగిలో పెట్టి వచ్చాడు. పెట్టుబడి కోసం రూ.3లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు చేశారు. అంతేకాకుండా రూ.20వేలు కేడీసీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. వచ్చిన పంటకు ధర లేక వడ్డీలు అధికం కావడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి శనగ మాత్రలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. మృతునికి భార్య సుంకమ్మ, కుమారుడు బాలకృష్ణ, కుమార్తెలు సువర్ణ, భార్గవిలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాకేష్ తెలిపారు.