అప్రకటిత ఎమర్జెన్సీ
Published Fri, Jul 22 2016 11:18 AM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
అటవీ శాఖలో అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు
స్వాగతిస్తున్న ఉద్యోగులు..
జిల్లా పరిశీలకులుగా అదనపు పీసీసీఎఫ్ నియామకం
హరితహారం అమలుకు సర్కారు ప్రత్యేక చర్యలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : హరితహారం అమలుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ప్రజలు, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం అమలులో కీలక భూమిక పోషించే అటవీ శాఖలో అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించింది. కన్జర్వేటర్ నుంచి మొదలుకుని, కింది స్థాయి సిబ్బంది వరకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేసింది. ఈ కార్యక్రమం అమలు చేస్తున్నన్ని రోజులు సెలవులు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరు వరకు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగించాలని నిర్ణయించింది. అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది అందరు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండటం గమనార్హం. అడవుల రక్షణ, సామాజిక వనాల పెంపకం వంటి ప్రధాన లక్ష్యాలుగా పనిచేసే తమ శాఖ విధుల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం పట్ల వారు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ఉన్నతాధికారి పరిశీలన..
జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించింది. అరణ్యభవన్‌లో పనిచేసే అదనపు పీసీసీఎఫ్ పి.మధుసూదన్‌రావును జిల్లా పర్యవేక్షణ అధికారిగా నియమించింది. ఈ నెల మొదటి వారంలోనే జిల్లాకు వచ్చిన ఆయన నిత్యం హరితహారం కార్యక్రమం అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజులకోసారి మండల స్థాయిలో పనిచేసే రేంజ్ అధికారులతో సహా అన్ని స్థాయిల్లో అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలు తీరుపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు.
ఈ నెలాఖరు వరకు ఈ అధికారి జిల్లాలోనే ఉంటారని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు హరితహారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంకా వర్గీస్‌తోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ ఇటీవల జిల్లాలో పర్యటించి, ఈ కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. నేరడిగొండ, సారంగాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు చెందిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిత్యం కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.
1.87 కోట్ల మొక్కలు..
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా ఈ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొక్కలు నాటేందుకు సానుకూల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మొక్కలు నాటాలని అటవీ శాఖ భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1.87 కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ నివేదికల్లో పేర్కొంటోంది. గురువారం ఒక్కరోజే 5.20 లక్షల మొక్కలు నాటినట్లు రికార్డు చేశారు.
Advertisement