భూత్పూర్ మండలం వెల్కిచర్ల శివారులో ఎండుముఖం పట్టిన మొక్కజొన్న పంట
కరువుపై కసరత్తు
Published Thu, Aug 18 2016 1:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
మహబూబ్‌నగర్ వ్యవసాయం : జిల్లాలో నెల రోజులుగా వర్షాలు మోహం చాటేశాయి.దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.. దీంతో కరువు తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని జేడీఏ బాలునాయక్ ఇప్పటికే ఏఓలను ఆదేశించారు.. అందుకనుగుణంగా వారు ఆయా మండలాల్లో తిరుగుతూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. జిల్లా ఖరీఫ్ సగటు వర్షపాతం 604.6మి.మీ కాగా ఇప్పటివరకు 268.6మి.మీ. మాత్రమే నమోదైంది. జూన్‌లో 71.2మి.మీ. కురవాల్సి ఉండగా 136.6మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం కన్నా 91.2శాతం అదనంగా కురిసింది. జూౖలñ లో 146.6మి.మీ కురవాల్సి ఉండగా 104.1మి.మీ. మాత్రమే కురిసి, 29శాతం లోటు వర్షపాతం నమోదైంది.
ఆగస్టులో 121మి.మీ కురవాల్సి ఉండగా కేవలం 27.9మి.మీ. కురిసి 76.9శాతం లోటుకు చేరుకుంది. ఇక వంగూరు, ఉప్పునుంతల మండలాల్లో సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం కురిసింది. మరో 21 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ మండలాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఏడీఏ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించేందుకు అధికారులు ముందుకు కదిలారు.
10మండలాల్లో పరిశీలన
ప్రస్తుతం కల్వకుర్తి, వంగూరు, ఉప్పునుంతల, మాడ్గుల, తలకొండపల్లి, వెల్దండ, ఆమన్‌గల్, మిడ్జిల్, భూత్పూర్, బిజినేపల్లి మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మండలాల్లో ఇప్పటికే మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలు ఎండుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిసినా పంటలకు ఎలాంటి ఉపయోగంలేదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. సాధారణంగా ఒక మండలంలో 2.5మిల్లీమీటర్ల కన్నా తక్కువగా వరుసగా 21రోజులు వర్షం కురియకుంటే దానిని డ్రై స్పెల్‌గా నిర్ణయిస్తారు. చాలా మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణం కన్నా చాలా తక్కువ స్థాయిలో దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు గుర్తించారు.
ఎండుతున్న పంటలు
ఖరీఫ్ సీజన్ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 7.67లక్షల హెక్టార్లు కాగా గతేడాది 5.31లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. కాగా ఈసారి రైతులు 6.6లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో 1.93లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 1.72లక్షల హెక్టార్లలో కంది, 1.23లక్షల హెక్టార్లలో పత్తి, 0.4లక్షల హెక్టార్లలో ఆముదం, 0.28లక్షల హెక్టార్లలో జొన్న సాగు చేస్తున్నారు. కాగా వర్షాలు రోజురోజుకూ మొహం చాటేయడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. లోటు వర్షపాతం నమోదైన 23 మండలాల్లో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో గతేడాదిలాగే కరువు పరిస్థితులు ఏర్పడితే తమ బతుకులు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వెంటనే నివేదికలు ఇవ్వాలి
జిల్లాలో తక్కువ వర్షపాతం కురిసి, రైతులు సాగున పంటలు ఎండుముఖం పట్టిన పది మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఏఓలకు సూచించాం. వారు ఈ నివేదికలను తయారుచేసిన తర్వాత కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాం.
– బాలునాయక్, జేడీఏ, మహబూబ్‌నగర్
Advertisement
Advertisement