మేకలు కాస్తున్న ఓ వ్యక్తిని చిరుతపులి చీరేసింది. అనంతపురం జిల్లా సండూరు తాలూకా సిద్దాపురంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తోరణగల్లు: మేకలు కాస్తున్న ఓ వ్యక్తిని చిరుతపులి చీరేసింది. అనంతపురం జిల్లా సండూరు తాలూకా సిద్దాపురంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరా ప్రకారం సిద్దాపురానికి చెందిన భరమలింగప్ప(52) బుధవారం మధ్యాహ్నం తన పొలంలో మేకలు కాస్తుండగా సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన ఓ చిరుత మేకపై దాడి చేసి చంపింది. దీనిని గమనించిన భరమలింగప్ప చిరుతను అదిలించాడు. దీంతో చిరుత మేకను వదిలేసి రైతుపై దాడి చేసింది.
ఈలోగా చుట్టు పక్కల ఉన్న రైతుల అరుపులతో చిరుత పరారైంది. కానీ అప్పటికే చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన బరమలింగప్ప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రైతులు అటవీ శాఖాధికారులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉండగా, మూడు నెలల్లో ముగ్గురిని చిరుత పొట్టన పెట్టుకున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పరిసర గ్రామాల రైతులు వాపోతున్నారు.