
బాబోయ్ చిరుత
♦ పొలాల్లో సంచారం
♦ భయం గుప్పిట్లో ఏదుల్లాపూర్, శివ్వంపేట
♦ బోను ఏర్పాటు చేయాలని విన్నపం
శివ్వంపేట : చిరుత సంచారం వెలుగులోకి రావడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మండల పరిధిలోని ఏదుల్లాపూర్ గ్రామ వ్యవసాయ పొలాల్లో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. ఏదుల్లాపూర్, శివ్వంపేట గ్రామాలకు చెందిన రైతుల పొలాలు అడవిని ఆనుకొని ఉన్నాయి. ప్రస్తుతం మొక్కజొన్న పంటను వేశారు. అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు గాను రాత్రి వేళల్లో కాపలాకు వెళ్ళాల్సి వస్తుంది. చిరుత సంచారం వెలుగులోకి రావడంతో రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు.
పొలాల వద్ద పశువుల పాకలున్నాయని, ఏ సమయాన, ఎటు నుంచి చిరుత దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. అటవి సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేయాలని శివ్వంపేట, ఏదుల్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు కోరుతున్నారు. అటవీ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని ఎంపీపీ కల్లూరిహరికృష్ణ, సర్పంచ్ సునందరెడ్డి కోరారు.
ఆందోళన వద్దు
చిరుతతో రైతులకు ఎలాంటి ప్రాణభయం ఉండదని ఫారెస్ట్ సెక్షన్ అధికారి యాగ్దాని అన్నారు. చిరుత ఒకే ప్రాంతంలో ఉండదని, ఒకచోటు నుంచి మరో చోటుకి వెళ్తుందన్నారు. బోను ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మోతుకు చెట్టు ఎక్కాను
అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నాను. రోజులాగే గురువారం రాత్రి అటవీ పందుల భారి నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం వద్దకు వెళ్ళాను. అర్ధరాత్రి సమయంలో శబ్దం రావడంతో టార్చ్‌లైట్‌వేసి చూడగా కొద్దిదూరంలో చిరుత ఉన్న విషయం గుర్తించాను. వెంటనే సమీపంలో ఉన్న మోతుకు చెట్టు ఎక్కి కూర్చొని సెల్‌ఫోన్‌ద్వారా గ్రామస్థులకు సమాచారం ఇచ్చా. పలువురు గ్రామతలు శబ్దం చేసుకుంటు రావడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. - సునందరెడ్డి, సర్పంచ్