నీటి సమస్యను పరిష్కరించుకుందాం
-జీడీపీ నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ అవసరం
- రూ. 56 కోట్లతో నాబార్డుకు ప్రతిపాదనలు
-అఖిలపక్ష పారీ్టల నేతల రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎంపీ బుట్టా రేణుక
కోడుమూరు రూరల్: పార్టీలకతీతంగా కలసి కట్టుగా మంచినీటి సమస్యను పరిష్కరించుకుందామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక అన్నారు. శనివారం ఎంపీ కోడుమూరులో నెలకొన్న మంచి నీటి సమస్యపై స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో అఖిలపక్ష పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరులో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కోడుమూరుకు మంచినీటి పైపులైన్ నిర్మాణం చేపట్టడమొక్కటే మార్గమన్నారు. కోడుమూరు, చుట్టు పక్కల గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 56కోట్లు అవసరమని నాబార్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు.
గడిచిన మూడేళ్లల్లో కోడుమూరు నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు, అభివృద్ధి పనులకు రూ.2.17కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు. అన్ని పార్టీల నేతలు కలసి వస్తే నీటి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీ సూచించారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో నిరుద్యోగం, నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు ఉండవన్నారు. తన పార్లమెంట్ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతి సంవత్సరం పుస్తకం ముద్రిస్తున్నట్లు చెప్పారు.