పొగచూరిన బతుకులు
– తీరని మధ్యాహ్నభోజన వంట ఏజెన్సీల కష్టాలు
– ఏళ్లు గడుస్తున్నా కట్టెలపొయ్యిలపైనే వంటలు
– ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైన గ్యాస్ కనెక‌్షన్లు
మధ్యాహ్నభోజనం పథకం వంట ఏజెన్సీల కష్టాలు తీరడం లేదు. అదిగో గ్యాస్ పోయ్యిలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం తప్ప ఆచరణలో పెట్టింది లేదు. నేటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కట్టెల పోయ్యిలపైనే నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. పొగ ఎఫెక్ట్‌కు ఇప్పటికే కొందరు కంటి, శా్వస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు.
కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమన్య కింద ప్రాథమిక పాఠశాలలు1928, ప్రాథమికోన్నత పాఠశాలలు 481, ఉన్నత పాఠశాలలు 448 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వారికి నాణ్యమైన షౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం 2003 నుంచి మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఆహార పదార్థాల తయారీ బాధ్యత పొదుపు మహిళల (వంట ఏజెన్సీ)కు అప్పగించింది. ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తూ మిగతా సరుకులకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ విద్యార్థులకు ఒక్కోరికి రూ. 5.13, హైస్కూల్ విద్యార్థులకు రూ. 7.18 ప్రకారం నిరా్వహకులకు చెల్లిస్తోంది. అందులోనే వంట చేసేందుకు అవసరమైన కట్టెలను కొనుగోలు చేయాల్సి ఉంది.
దరిచేరని గ్యాస్‌పోయ్యిలు
కట్టెల పొయ్యిలపై వంట చేస్తుండటంతో నిర్వాహకుల ఆరోగ్యం దెబ్బతింటుందని, గ్యాస్ కనెక‌్షన్లు ఇస్తామని ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే దాదాపు 13 ఏళ్లు గడస్తున్నా అమలు కాలేదు. ఇంత వరకు ఒక్కరికి కూడా ఒక్క కనెక‌్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తుండడంతో అందులో నుంచి వచ్చే పొగకు చాలామంది కంటి చూపు తగ్గడం, తలనొప్పులు రావడం మొదలైంది. మరికొందరు ఊపిరితిత్తుల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయినా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ఇటీవలే గ్యాస్ కనెక‌్షన్ల కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ సారైనా అనుమతులు ఇస్తుందో లేదోననే వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
కట్టెలపై వంటలు చేయలేకపోతున్నాం
– లలితమ్మ, కల్లూరు జడ్పీ హైస్కూల్ వంట ఏజెన్సీ నిర్వాహకురాలు
పిల్లలకు వంట చేసేందుకు గ్యాస్‌పొయ్యిలు లేకపోవడంతో కట్టెలపైనే చేస్తున్నాం. వానా కాలం కట్టెలు చిక్కని పరిస్థితి నెలకొంది. దీనికితోడు వాటిపై వంట చేస్తుండటంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకోపోయాం.