
రాములు(ఫైల్)
కుషాయిగూడ: చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్‌లో జీవితఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ జైల్ నుంచి పరారయ్యాడు. సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం, యన్‌సాన్‌పల్లి ›గ్రామానికి చెందిన రాములు (19) 2013లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో అతడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. శిక్ష అనుభవిస్తున్న రాములును సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా భావించిన జైల్ అధికారులు గత జూలై–18న చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్‌కు తరలించారు.
ఆదివారం ఖైదీలందరితో కలిసి పని చేసేందుకు వెళ్లిన రాములు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అతడు తిరిగి జైల్‌లోకి రాకపోవడం విషయం గమనించిన జైలు అధికారులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తుందని రాములు భావించాడని, అయితే జాబితాలో తన పేరులేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నట్టు సమాచారం.