‘సాగర్’కు ‘మల్లన్న’తో జీవం
‘సాగర్’కు ‘మల్లన్న’తో జీవం
Published Sun, Aug 7 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
బాన్సువాడ : ప్రపంచంలోనే మొట్టమొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన నిజాంసాగర్ సమైక్య పాలకుల తీరుతో ఎడారిగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లనసాగర్‌తోనే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడలోని తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు.
ఈ వర్షాకాలంలో సగటు వర్షపాతం 402 మిల్లీమీటర్ల కాగా 17 శాతం అధికంగా 429 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, కానీ నిజాంసాగర్, పోచంపాడ్ ప్రాజెక్టుల్లో ఆశించినంత నీరు చేరలేదని పేర్కొన్నారు. ప్రాణహిత నదినుంచి వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందన్నారు. ప్రాణహిత–ఇంద్రావతి నదుల నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్‌కు మళ్లిస్తే జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు.
కాళేశ్వరం ద్వారా ఉత్తర తెలంగాణాలోని 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతాయని, మరో 20 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు లభిస్తుందని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ఎల్తైన ప్రదేశంలో ఉన్నందున, ఎత్తిపోతల ద్వారా అక్కడి వరకు నీరును తీసుకువచ్చి, నేరుగా రోజు నిజామాబాద్ జిల్లాకు 3 టీఎంసీల చొప్పున నీరు అందించవచ్చన్నారు. ఇప్పటికే రూ. 13 వేల కోట్లతో టెండర్లను ఆహ్వానించామన్నారు. మల్లన్నసాగర్ నిర్మిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, ఎల్లారెడ్డిలో లక్ష, బాన్సువాడలో 30 వేలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో లక్ష, బాల్కొండలో 30 వేలు, ఆర్మూర్ నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు సాగు నీర అందుతుందని పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యం గల మల్లన్నసాగర్‌ను నిర్మించకుండా, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు భూములు అప్పగిస్తున్నారని, వారికి పాదాభివందనం తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ మంగళవారం రైతులతో చలో నిజాంసాగర్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గర్భంలో నిర్వహించే కార్యక్రమంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. నిజాంసాగర్ దుస్థితిని ప్రపంచానికి చూపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు పాల్గొనాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహ్మద్ ఎజాస్, భాస్కర్, సురేశ్, శ్రీనివాస్, స్వరూప, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement