మద్దతు కొంతే!
మద్దతు కొంతే!
Published Sat, Sep 24 2016 1:59 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
–తూతూ మంత్రంగా ఉల్లి కొనుగోలు
–రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం
– తెలంగాణలో క్వింటా రూ.800
– ఏపీ రూ.600తో కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతుకు మద్దతు ధర అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వం క్వింటా రూ.800 ఆపై ధరకే కొనుగోలు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం రూ.600తో సరిపెడుతోంది. గత ఏడాది ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగదారులు ఆందోళన చెందుతున్న సమయంలో క్వింటా ఉల్లిని రూ.4000 ప్రకారం కొనుగోలు చేసిన విషయం విదితమే. రైతులు నష్టపోతున్న పరిస్థితుల్లో మద్దతు ధర ఇవ్వకుండా కొనుగోళ్లు చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఈ ఏడాది జిల్లాలో 24వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువగా ఉండటం, అన్ని ప్రాంతాల్లోను ఉల్లి సాగు చేపట్టడంతో డిమాండ్ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు తగ్గిపోయాయి. గతంలో ధరలు తగ్గినా క్వింటాల్‌కు కనీసం రూ.400 నుంచి రూ.500 వరకు లభించేది. ఈ సారి అది రూ.50 నుంచి 150 వరకు ఉండటంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రవాణా ఖర్చులు కూడ గిట్టడంలేదంటే అన్నదాతలు ఆవేదన వ్యక్త ంచేస్తున్నారు.
తూతూ మంత్రంగా కొనుగోళ్లు...
గత నెల చివరి వారంలో ధరలు పడిపోవడంతో రైతుల చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. క్వింటాలు రూ.600 ప్రకారం కొనుగోలు చేపట్టింది. అయితే ఇది కూడా నామమాత్రమే. రోజుకు సగటున 50 టన్నులు కూడ కొనడం లేదు. ప్రభుత్వం ఇండెంటు తక్కువగా ఇస్తుండటం, ఒక్కో రోజు అసలు ఇవ్వకపోవడంతో ఉల్లి కొనుగోళ్లు తగ్గాయి. ఇండెంట్ తక్కువ ఇస్తుండటంతో ఒత్తిళ్ల మేరకు వీఐపీల ఉల్లినే కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాధారణ రైతులు పండించిన ఉల్లిని పట్టించుకునే దిక్కులేదు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రస్తుతం రోజుకు 6000 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాత్రం క్వింటా రూ.800తో కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ ధరతో ప్రభుత్వం ఎపుడు కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు.
పెట్టుబడి రూ.50 వేలు..
ఉల్లి సాగులో ఎకరాకు సగటున రూ. 50 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు మంచి పంట అంటే 50 క్వింటాళ్లు వస్తుంది. కొద్దిరోజులుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో 50 శాతం మంది రైతులకు లభిస్తున్న ధర కేవలం రూ.200 వరకు మాత్రమే ఉంది. అంటే ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.10 వేలు వస్తుంది. పండించిన ఉల్లిని మార్కెట్‌కు తీసుకరావాలంటే క్వింటాలుకు రూ.100 వరకు ఖర్చు వస్తుంది. అంటే మార్కెట్‌కు తరలించడానికే రూ.5000 ఖర్చు అవుతోంది. కోత ఖర్చులు, హమాలీ చార్జీలు, కమీషన్ ఏజెంటు కమీషన్ ఇతర ఖర్చులు తీసివేస్తే రైతులకు మిగులు అంటూ ఏమి ఉండటం లేదు.
రూ.1000 మద్దతు ధర ఇవ్వాలి: చిన్న రామాంజనేయులు, గుమ్మకొండ, డోన్ మండలం
నేను 400 ప్యాకెట్ల ఉల్లిని మార్కెట్‌కు తెచ్చాను. వ్యాపారులు రూ.100 ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. ఈ ధరతో అమ్మకుంటే కేవలం రవాణా చార్జీలు మాత్రమే లభిస్తాయి. పెట్టుబడి మొత్తం బూడిదలో పోసినట్లు అవుతోంది. క్వింటాకు కనీసం రూ.1000 మద్దతు ధర ఇవ్వాలి. అపుడే రైతులకు పెట్టుబడి లభిస్తుంది.
Advertisement