దగాపడుతున్న రైతన్న
దగాపడుతున్న రైతన్న
Published Wed, Oct 26 2016 10:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
–మద్దతు ధర పేరుతో ప్రభుత్వం మోసం
–రైతుకు గరిష్టంగా దక్కుతున్నది రూ.300 మాత్రమే
–ఆదివారం మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని ఇప్పటి వరకు కొనుగోలు చేయని వ్యాపారులు
–దోమలకాటుతో అల్లాడుతున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర విషయంలో ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది. ఉల్లికి మద్దతు ధర రూ.600 అంటూ ప్రకటించిన ప్రభుత్వం ఇస్తుంది మాత్రం రూ.300. మార్కెట్‌కు రైతులు నాణ్యమైన ఉల్లినే తీసుకు వస్తున్నారు. రైతులు తెచ్చిన ఉల్లిలో 60శాతం ఉల్లికి రూ.50 నుంచి రూ.250 వరకు మాత్రమే ధర లభించాల్సి ఉంది. అంటే ప్రభుత్వం చెప్పిన ఉత్తర్వుల ప్రకారం క్వింటం ఉల్లికి వేలంపాటలో ధర రూ.100 లభిస్తే మద్దతు ధర ప్రకారం రూ.500 చెల్లించాలి. జిల్లా యంత్రాంగం రూ.50 నుంచి రూ.300 వరకు ధర లభించినా రైతులకు రూ.300 మాత్రమే చెల్లిస్తోంది. ప్రభుత్వం ప్రకటించింది ఒకటైతే అమలు తీరు మరో విధంగా ఉండటంతో రైతుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉల్లి కొనుగోళ్లలో నెలకొన్న నిర్లక్ష్యంతో రైతులు మార్కెట్‌లో రోజుల తరబడి ఉండాల్సి వస్తోంది. వేలంపాట(బీట్) ఎప్పుడు వేస్తారో.. ఎన్నడు కొనుగోలు చేస్తారో తెలియక రైతులు మార్కెట్‌లో నరకం చూస్తున్నారు. ప్రభుత్వం ఉల్లికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా రెవెన్యూ డివిజన్ వారీగా ఉల్లి కొనుగోళ్లు చేపట్టారు. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు డివిజన్ రైతులు, మంగళ, గురువారాల్లో ఆదోని డివిజన్ రైతులు, శనివారం నంద్యాల డివిజన్ రైతులు మార్కెట్‌కు ఉల్లి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విధానం ఈ నెల 24 నుంచి (సోమవారం) అమల్లోకి వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వచ్చిన ఉల్లిని ఆదే రోజు వేలంపాటకు పెట్టారు. కాని బుధవారం వరకు కూడా కొనుగోలు చేయలేదు. దీన్ని బట్టి ఉల్లి కొనుగోలులో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. 24న వచ్చిన కర్నూలు రెవెన్యూ డివిజన్ ఉల్లినే ఇంతవరకు కొనలేదంటే మంగళవారం వచ్చిన ఆదోని డివిజన్ ఉల్లిని, బుధవారం వచ్చిన కర్నూలు డివిజన్ ఉల్లిని ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. మరోవైపు దోమలబెడదతో రైతులు వ్యాధులకు గురవుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు మొదటి రోజు మాత్రమే మధాహ్న భోజనం సబ్సిడీపై పెడుతున్నారు. తర్వాత పెట్టడం లేదు.
గ్రేడింగ్ ఇవ్వని ఉల్లిని కొనుగోలు చేయని వ్యాపారులు..
రైతులు తెచ్చిన ఉల్లి నాణ్యతను బట్టి గ్రేడింగ్‌లు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఉద్యాన అధికారులతో టీములు ఏర్పాటు చేశారు. ఈ టీములు నాణ్యతను ఏ, బీ, సీ గ్రేడ్‌లు ఇస్తున్నారు. 10శాతం ఉల్లి బాగా లేదని గ్రేడింగ్ ఇవ్వడం లేదు. అటువంటి ఉల్లిని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు ఉల్లిని తీసుకువచ్చిన రైతుల పడుతున్న ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు. కొందరు రైతులు మార్కెట్‌లోనే ఉల్లిని వదలి వెళ్లిపోతున్నారు.
ఇంతవరకు ఉల్లి కొనుగోలు చేయలేదు: మౌలాలి
మాది కోడుమూరు మండలం కొత్తపల్లి గ్రామం. 30 ప్యాకెట్ల ఉల్లిని తీసుకుని ఆదివారం రాత్రి వచ్చాను. సోమవారం ఉల్లిని వేలంపాటకు పెట్టాను. బుధవారం వరకు వేలంపాట రాలేదు. వ్యాపారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడు బీట్ వస్తుందో తెలియని పరిస్థితి. రాత్రిళ్లు మార్కెట్‌లో దోమలతో సావాసం చేస్తున్నాం.
ఉల్లిని అమ్ముకునే వరకు రూ.10 కే భోజనం పెట్టాలి: గోవిందప్ప
మాది చిప్పగిరి మండలం నేమకల్ గ్రామం. రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. 270 ప్యాకెట్ల ఉల్లిని తీసుకుని ఆదివారం మార్కెట్‌కు వచ్చాను. ఇంతవరకు కొనుగోలు చేయలేదు. ఒక్క పూట మాత్రమే రూ.10 భోజనం పెట్టారు. మార్కెట్‌లో ఉల్లి కొనుగోలు చేయలేదంటే అందుకు బాధ్యత మార్కెట్ కమిటీదే. ఒక్క రోజు రూ.10కి భోజనం పెట్టి చేతులెత్తేస్తే ఎలా... ఉల్లి అమ్మకం అయ్యే వరకు సబ్సిడీపై భోజనం పెట్టాలి.
బీట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది: బ్రహ్మయ్య, కోడుమూరు
ఆదివారం మార్కెట్‌కు 35 ప్యాకెట్ల ఉల్లిని తీసుకుని వచ్చాను. ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. వేలంపాట ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.ఇంటి దగ్గర ఎవరూలేరు. త్వరగా కొనుగోలు చేసే విధంగా చూడాలని వ్యాపారులను, అధికారులను కోరుతున్నా పట్టించుకునే వారు లేరు.
Advertisement
Advertisement