చిన్ని బతుకులకు అంతులేని కష్టాలు | lives with tears | Sakshi
Sakshi News home page

చిన్ని బతుకులకు అంతులేని కష్టాలు

Published Wed, Aug 17 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

నివాసం ఉంటున్న ఇంటి ముందు చెల్లి, తమ్ముడుతో నీలిమ.

నివాసం ఉంటున్న ఇంటి ముందు చెల్లి, తమ్ముడుతో నీలిమ.

ఊరంతా రాఖీ పండుగ చేసుకుంటోంది. కానీ ఆ అక్కాతమ్ముళ్లు మాత్రం ఈ పూట ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తున్నారు. అందరూ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించుకుంటున్నారు. కానీ వారు మాత్రం తమ రోజులు ఎప్పుడు మారుతాయా అని ఎదురు చూస్తున్నారు. లాలన చూసే తల్లి లేక, పాలన చూసే తండ్రి లేక ఆ పిల్లల బతుకులు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం కోసమే స్కూలుకు వెళ్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఉన్న వారు కూడా దూరమైపోతారేమో అన్న భయంతో ఓ చిన్న అబ్బాయి నవోదయలో సీటు కూడా వదిలేశాడంటే నమ్మాల్సిందే. ఈ రాఖీ పండుగ నాడు ఈ అక్కాతమ్ముళ్ల బతుకులను ఓ సారి చూద్దాం. నిత్యం వారి కన్నుల్లో ప్రవహిస్తున్న జీవనదుల లోతుల్ని తెలుసుకుందాం.
– జలుమూరు 
 
మండలంలోని గొటివాడ గ్రామానికి చెందిన రాము, లక్ష్మి దంపతులకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వీరితో పాటు ఓ ఆడబిడ్డను కోల్‌కతా నుంచి వీరు పెంచడానికి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి పేరు నీలిమ. కొన్నాళ్ల వరకు సాఫీగానే సాగిన వీరి సంసార నావ లక్ష్మి కారణంగా మొదటి సారి అదుపు తప్పింది. ఇంత మంది ఆడపిల్లలను పోషించలేక ఆమె తన భర్తతో బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. దీంతో సంతాన పోషణ బాధ్యత మొత్తం రాముపైనే పడింది. ఆ భారం మోయలేక రాము మంచానపడ్డాడు. నాలుగేళ్లు మరణంతో పోరాడి ఓడిపోయాడు. తల్లీతండ్రి చనిపోయాక ఈ పిల్లల బతుకులు మరింత దుర్భరమైపోయాయి. అంతకుముందే కూతుళ్లలో పెద్దవారైన మల్లెమ్మ, సంధ్యలు గుంటూరుకు పని కోసం వెళ్లి అక్కడే వివాహాలు చేసుకుని స్థిరపడిపోయారు. మూడో అమ్మాయి దివ్య కూడా పది పాసై ఆ తర్వాత చదవడానికి ఆర్థిక స్థోమత సరిపోక గుంటూరుకే వెళ్లిపోయింది. 
 
తండ్రి చనిపోవడం, చూసే వారు లేకపోవడంతో పసివారైన ముగ్గురు పిల్లలకు అసలు కష్టాలు మొదలయ్యాయి. వీరిలో నీలిమే పెద్ద అమ్మాయి. అప్పటి వరకు చదువుతూ ఉన్న నీలిమ అక్కలందరూ వెళ్లిపోవడంతో తమ్ముడు అప్పలనాయుడు, చెల్లి వెన్నెలను చూసుకోవడానికి చదువు మానేసింది. వెన్నెల ఇప్పుడు గొలివాడ ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. అప్పలనాయుడు తిమడాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరు చదువుతున్నాడు. అబ్బాయికి ఏపీ రెసిడెన్షియల్, నవోదయ పాఠశాలల్లో చదివేందుకు సీట్లు లభించినా అక్క, చెల్లిని వదిలి వెళ్లలేకపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ స్కూలులోనే భోజనాలు కానిచ్చేస్తున్నారు. రేషన్‌ కార్డు ఉండడంతో ఒక పూట భోజనం అయిపోతోంది. కానీ ఈ ముగ్గురు పిల్లలే బతకాలంటే ఈ సదుపాయాలు ఏ మాత్రం సరిపోవు. అందుకే ఈ చిట్టి చేతులు కాసింత బలాన్ని కోరుతున్నాయి. కుటుంబానికి పెద్దవారంటూ ఎవరూ లేకపోవడంతో కాసింత సాయం అర్థిస్తున్నాయి. వీరు ఉంటున్న పాక కూడా చాలా చిన్నది. కొద్దిగా పెద్ద వాన వస్తే వీరికి నరకమే. రాత్రివేళల్లో నిద్రపట్టే రోజులు చాలా తక్కువ. ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడడానికి వీరు నానా కష్టాలు పడుతున్నారు.
 
ఇళ్లు విడిచి వెళ్లిన వారు వీరి గురించి పట్టించుకోవడం లేదు. స్థానికులు, స్థానిక సర్పంచ్‌ మురళీకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు వీరికి కొంత ఆర్థిక సాయం చేశారు. అలాగే మరికొంత మంది స్పందిస్తే తమ బతుకులు బాగు పడతాయని ఈ చిన్నారులు కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 7036507287 నంబర్‌కు సంప్రదించాలని కోరుతున్నారు. ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు ఎస్‌బీఐ అకౌంట్‌ నంబరు 31495326846లో సాయం జమ చేయవచ్చని తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement