పెద్ద శేషవాహనంపై శ్రీవారి విహారం
– వైభవంగా శ్రీవారి వాహన సేవల ఆరంభం
– తిరుమలకొండ మీద బ్రహ్మోత్సవ కాంతులు
సాక్షి,తిరుమల:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువు దీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యత. అందుకే తొలి రోజు శేషవాహనం మీదే ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వాహన మండపంలో వేంచేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర వస్త్ర, సుగంధ పరమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 9 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాల, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఉభయదేవేరులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయం పొందారు. వాహన సేవ ముందు భజన బృందాల కోలాహలం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల నృత్యాలు, కోలాటాలు, నగర సంకీర్తనలు భక్తులను అలరించాయి. పుష్పాలంకరణ, విద్యుత్ దీపకాంతుల్లో ఆలయం, పురవీధులు స్వర్ణకాంతులీనాయి.