లారీల సమ్మె విజయవంతం
యజమానుల అరెస్టు, విడుదల
కర్నూలు: దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సమ్మె పిలుపులో భాగంగా కర్నూలులో లారీల సమ్మె తొలి రోజు గురువారం విజయవంతమైంది. హైదరాబాద్ జాతీయ రహదారిలోని సంతోష్‌నగర్ దగ్గర లారీలను అడ్డుకున్న లారీ యజమానుల సంఘం అధ్యక్షులు గోపి, ఉపాధ్యక్షుడు మిన్నెల్లతో పాటు మరో పది మంది నాయకులను నాలుగో పట్టణ పోలీసులు సీఐ నాగరాజురావు ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. విషయం తెలిసిన వెంటనే లారీ యజమానులు, కార్మికులు పెద్ద ఎత్తున నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, నగర కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొని లారీ యజమానుల అరెస్టును ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగంపై భారాలు మోపడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కోట్లాది ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేసే రవాణా రంగంపై ఆర్టీఏ ఫీజులు, జరిమానాలు పెంచడంతో పాటు వాహనాలపై థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ 50 శాతం పెంచడం దారుణమన్నారు. పెరిగిన డీజిల్ ధరలు, టోల్‌గేట్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో రవాణా రంగం సంక్షోభంలో పడిందన్నారు. లారీ యజమానుల సంఘం నాయకులు యూసుఫ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నాగరాజు, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు రియాజ్, గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.