హమ్మయ్యా... లారీలు రోడ్డెక్కాయి | lorry strike call off.. vehicles started | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా... లారీలు రోడ్డెక్కాయి

Published Thu, Jun 25 2015 9:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

lorry strike call off.. vehicles started

సాక్షి, హైదరాబాద్: ఒకరోజు సమ్మె అనంతరం తిరిగి లారీలు రోడ్డెక్కాయి. తెలంగాణ లారీ యజమానుల సంఘం డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించటంతో సమ్మెకు తెరపడింది. మంగళవారం అర్ధరాత్రి మొదలైన సమ్మె బుధవారం తీవ్ర ప్రభావం చూపటంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. బుధవారం ఎరువులు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణాకు ఇబ్బంది ఎదురుకావటంతో విషయాన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో ఆయా శాఖల మంత్రులు సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు వివరించారు. వ్యవసాయక్షేత్రంలో ఉన్న ఆయన వెంటనే లారీ యజమానుల సంఘంతో చర్చించి సమ్మెను నిలిపివేసేలా చూడాలని ఆదేశించటంతో గురువారం ఉదయం రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులు లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో సచివాలయంలో చర్చించారు.

మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన సంఘం సభ్యులు... త్రైమాసిక పన్నును జనాభా నిష్పత్తిలో తగ్గించాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య లారీలు సంచరించేలా రూ.5 వేల వరకు తీసుకుని వార్షిక కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలనే తొలి రెండు డిమాండ్లపై పట్టుపట్టారు. ఇవి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అయినందున వాటిపై మంత్రులు తొలుత స్పష్టత ఇవ్వలేదు. వాటిని అంగీకరిస్తేనే సమ్మె విరమిస్తామని సంఘం ప్రతినిధులు పట్టుపట్టడంతో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌లకు సమ్మతిస్తున్నట్టు మంత్రులు పేర్కొన్నారు. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన త్రైమాసిక పన్ను తగ్గింపు సహా మిగతా డిమాండ్లపై స్పష్టత ఇచ్చేందుకు కొంత గడువు కావాలని, రావాణ రంగంతో ముడిపడిన విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి ఆ బాధ్యతను దానికి అప్పగిస్తామని మంత్రులు ప్రతిపాదించారు. దీనికి లారీ యజమానుల సంఘం సభ్యులు సమ్మతించారు. కమిటీ మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని, దాని సిఫారసుల ఆధారంగా ఆ డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని మంత్రులు ప్రకటించారు. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ లారీ యజమానుల సంఘం సభ్యులు ప్రకటించారు.

గుజరాత్ విధానాల అధ్యయనం... దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలో రవాణారంగ విధానాలు ఆదర్శంగా నిలుస్తున్న నేపథ్యంలో వాటిని అధ్యయనం చేసేందుకు అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధుల బృందాన్ని పంపాలని నిర్ణయించినట్టు సమావేశానంతరం మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అక్కడి విధానాలను పరిశీలించి వాటిల్లో ఉన్నతంగా ఉన్నవాటిని ఇక్కడ అమలు చేస్తామని వెల్లడించారు. రవాణ, వాణిజ్య పన్నులు, పోలీసుశాఖలు వేధిస్తున్నాయనే లారీ యజమానుల సంఘం ఆరోపణల నేపథ్యంలో ఆ మూడు విభాగాల ఉన్నతాధికారులు, లారీల సంఘం ప్రతినిధులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటిపై చర్చించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని హైవేలపై ప్రత్యేకంగా లారీల కోసం పార్కింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని, 38 రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో డ్రైవర్ల శిక్షణకు కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రైవర్లు కోరకుండానే వారికి రూ.5 లక్షల వరకు ప్రమాద బీమాను ముఖ్యమంత్రి ప్రకటించినట్టు గుర్తుచేశారు. రూ.5 వేలు చెల్లిస్తే రెండు తెలుగు రాష్ట్రాల పర్మిట్... రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా త్రైమాసిక పన్ను విధింపు అమలులోకి వచ్చింది. తాజా చర్చల్లో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణ ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ రాష్ట్రప్రభుత్వం అంగీకరిస్తే...వార్షికంగా రూ.5 వేలు చెల్లించి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ పొందే వెసులుబాటు కలుగుతుంది. ఆ పర్మిట్లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో ఉన్న ఒప్పందం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒప్పందం కోసం ఏపీకి లేఖ రాయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. చర్చల్లో సంఘం గౌరవాధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కూడా పాల్గొన్నారు. హాజరైన కడియం...కానీ.. ఈ చర్చలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా హాజరయ్యారు. కానీ చర్చలో మాత్రం పాల్గొనలేదు. ఆ సమావేశమందిరంలో కడియం శ్రీహరి పాల్గొనే మరో సమావేశం జరగాల్సి ఉంది. కానీ లారీ సంఘ ప్రతినిధులతో ఇద్దరు మంత్రుల చర్చలు ఎక్కువ సేపు కొనసాగటంతో చేసేదిలేక ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వచ్చి సమావేశం ముగిసేవరకు ఆ హాలులో కూర్చోవాల్సి వచ్చింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement