చర్చలు విఫలం.. యథావిధిగా లారీల సమ్మె | Meeting with Lorry associations failed, strike to be continued | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం.. యథావిధిగా లారీల సమ్మె

Published Fri, Apr 7 2017 1:46 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

చర్చలు విఫలం.. యథావిధిగా లారీల సమ్మె

చర్చలు విఫలం.. యథావిధిగా లారీల సమ్మె

- లారీ యజమానుల సంఘం డిమాండ్లపై ఎటూ తేల్చని రవాణా మంత్రి
- ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంఘం ప్రతినిధులు
- రేపటి నుంచి దేశవ్యాప్త సమ్మె

సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్ర ప్రభుత్వంతో గురువారం రాత్రి జరిగిన చర్చలు విఫలం కావటంతో లారీల సమ్మె మరింత ఉధృతం కాబోతోంది. శుక్రవారం రాత్రి వరకు అత్యవసర సరుకులు తరలించే లారీలను సమ్మెలో చేర్చబోమని హామీ ఇచ్చిన తెలంగాణ లారీ యజమానుల సంఘం, శనివారం నుంచి వాటిని కూడా ఎక్కడికక్కడ నిలిపివేస్తామని హెచ్చరించింది. మరోవైపు శనివారం నుంచి సమ్మె జాతీయ స్థాయిలో మొదలు కాబోతోంది.

ఇప్పటి వరకు దక్షిణ భారత లారీ యజమానుల సంఘం మాత్రమే సమ్మె చేస్తుండగా, లారీల థర్డ్‌ పార్టీ బీమా మొత్తాన్ని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న ప్రధాన డిమాండ్‌ను బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ అంగీకరించకపోవటంతో జాతీయ స్థాయిలో సమ్మె నిర్వహించాలని ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. దానికి కట్టుబడి శనివారం నుంచి సమ్మెను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు జాతీయ స్థాయి లారీ యజమానుల సంఘాలు ప్రకటించాయి. కాగా, గ్రేటర్‌ హైదరాబాద్‌లో మంచినీటి సరఫరాను కూడా నిలిపివేయనున్నట్లు వాటర్‌ ట్యాంకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ తెలిపారు.

ముందుకు రాని ప్రభుత్వం...
సమ్మెను తీవ్రం చేయటంతోపాటు ‘అత్యవసర’ సరుకుల రవాణా లారీలను కూడా దాని పరిధిలోకి తెస్తామన్న తెలంగాణ లారీ యజమానుల సంఘం హెచ్చరికతో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి గురువారం రాత్రి అత్యవసరంగా తెలంగాణ లారీ యజమానుల సంఘాన్ని చర్చలకు ఆహ్వానించారు. వివిధ ప్రాంతాల్లో సమ్మె ఏర్పాట్లను పర్యవేక్షించే హడావుడిలో ఉండ టంతో కొంతమంది ప్రతినిధులు మాత్రమే సచివాలయంలో జరిగిన ఈ చర్చలకు వచ్చారు. జనజీవనం అస్తవ్యస్తమవుతున్నందున సమ్మె విరమించాలని మంత్రి కోరారు.

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాష్ట్రాల మధ్య సింగిల్‌ పర్మిట్‌ విధా నాన్ని ప్రారంభించాలని కోరితే మూడు నెలల క్రితమే సానుకూలంగా స్పందిస్తు న్నట్టు లిఖితపూర్వకంగా ఇచ్చినా ఎందుకు అమలు చేయలేకపోయారని లారీ సంఘం ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించారు. దీంతో మరోసారి ఏపీ అధికారు లతో మాట్లాడతామని మంత్రి పేర్కొనగా, మాటలతో ఎంతకాలం నెట్టుకొస్తా రని, వెంటనే అమలు కావాలని ప్రతినిధులు పట్టుపట్టారు. వారం రోజుల్లో దాన్ని కొలిక్కి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్రైమాసిక పన్ను విషయం అడగ్గా, ఆ ప్రతిపాదన కమిటీ పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు.

ప్రమాదాల సమయంలో డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేసే అధికారం రవాణాశాఖకు లేదని, అది న్యాయస్థానాలు తేల్చాల్సిందని సంఘం ప్రశ్నించింది. దీనికి కూడా మంత్రి కమిటీ విషయాన్నే తెరపైకి తేవటం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉన్న దాదాపు 12 వరకు డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవటంతో సమ్మెను కొనసాగించాలనే లారీ యజమానుల సంఘం తీర్మానించింది. గురువారం నాటి చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని, వాటిపై శుక్రవారం మధ్యాహ్నం ట్రాన్స్‌పోర్టు భవనంలో తమ సంఘం జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తామని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరెడ్డి, దుర్గాప్రసాద్‌ మంత్రికి తెలిపారు.

ఆంధ్రా లారీలను రానివ్వం...
ఏపీ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావటంతో అక్కడ సమ్మె విరమిస్తున్నట్టు వార్తలు వచ్చాయని, అదే జరిగితే ఆ రాష్ట్ర లారీలు తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటామని భాస్కరరెడ్డి హెచ్చరించారు.

8న రాజధానిలో ఆటోల బంద్‌...
థర్డ్‌ పార్టీ ప్రీమియం భారీగా పెంచడంపై ఆటో సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తంచేసింది. దీనికి నిరసనగా శనివారం నగరంలో ఆటోల బంద్‌ చేపట్టనున్నట్లు జేఏసీ నాయకులు వెంకటేశం, సత్తిరెడ్డి, కిరణ్, మారయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోల బంద్‌ నేపథ్యంలో... ఆర్టీసీ 500 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జూబ్లీ, ఎంజీబీఎస్‌తో పాటు ప్రధాన కూడళ్ల నుంచి ఈ బస్సులు నడుస్తాయని, 9959226154 (రెతిఫైల్‌), 9959226160 (కోఠి) నంబర్లకు ఫోన్‌ చేసి బస్సుల వివరాలను తెలుసుకోవచ్చని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ పురుషోత్తమ్‌ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement