ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
♦ యువకుడి మృతి, బయటపడిన బాలిక
♦ మొయినాబాద్‌లో ఘటన
మొయినాబాద్ : ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించగా యువకుడు మృతిచెందగా.. బాలిక క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన ఎం.నవీన్(23) న్యూబోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా చేస్తున్నాడు. నవీన్‌కు కొంతకాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలిక(17)తో పరిచయం ఏర్పడింది. ఏడాదిగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది.
బాలిక బుధవారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి.. నవీన్‌ను కలిసింది. ఇద్దరు కలసి జూపార్కుకు వెళ్లారు. మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేసి అక్కడి నుంచి మొయినాబాద్‌కు చేరుకున్న వారు.. సురంగల్ రోడ్డు పక్కన ఉన్న ఓ పాడుబడ్డ రేకుల షెడ్‌లోని ఓ గదిలోకి వెళ్లారు. పై కప్పు పైపునకు కేబుల్ వైరు కట్టి ఇద్దరు ఉరివేసుకున్నారు. నవీన్ మెడకు ఉరి బిగించుకుంది. బాలిక మెడకు వేసుకున్న వైరు తెగిపోవడంతో ఆమె కిందపడింది. ఏం చేయాలో అర్థంకాక నవీన్‌ను కాపాడేందుకు విఫలయత్నం చేసింది.