– నిప్పంటించుకున్న ప్రియురాలు
– మంటల్లో చిక్కుకొని ఆర్తనాదాలు
– కాపాడబోయిన ప్రియుడికీ గాయాలు
కదిరి టౌన్ : చిన్న సమస్య కారణంగా ప్రియురాలు ఒంటిపై నిప్పంటిచుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టింది. అక్కడే ఉన్న ప్రియుడు మంటలను ఆర్పి ఆమెను కాపాడాడు. అయితే ప్రియురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా, ప్రియుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. కదిరి కోనేరు సర్కిల్‌లో సెల్ షాపు నిర్వహిస్తున్న మోహన్‌కు మూడేళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. మూడు నెలల కిందట ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అయితే సమీప ప్రాంతమైన గొల్లదాని మండపంలో నివాసముంటున్న సుగుణతో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారి మధ్య ప్రేమకు దారితీసింది. సుగుణకు బేల్దారి గంగా«ద్రితో పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇద్దరూ కలసి తలుపుల మండలం బట్రేపల్లికి బైక్‌లో వెళ్లారు. అక్కడ వారిద్దరి మధ్య మనస్ఫర్థలు చోటుచేసుకున్నాయి. చిన్న గొడవ కూడా జరిగింది. దీంతో ఆవేశంతో సుగుణ తన చీరకు నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. మంటలను తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ పరుగులు తీసింది. అక్కడే ఉన్న మోహన్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అప్పటికే సుగుణ శరీరం మంటల్లో చిక్కి ఛాతీ, ముఖం, కడుపు ప్రాంతాల్లో తీవ్ర గాయలయ్యాయి. ఆమెను కాపాడబోయిన మోహన్‌కూ చేయి కాలింది. స్థానికుల సాయంతో 108లో వారిద్దరినీ కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
డ్యూటీ డాక్టరు ఐనుద్దీన్ వైద్యపరీక్షలు నిర్వహించి, ప్రథమ చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. న్యాయమూర్తి ఆస్పత్రికి వచ్చి సుగుణ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే బాధితురాలు సుగుణ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తోంది. తన భర్త తరచూ అనుమానించి వేధించేవాడని, దీంతో జీవితంపై విరక్తితో బట్రేపల్లి సమీపానికి రాగానే తానే చీరకు నిప్పంటించుకున్నానిని, దారెంట వెళ్లే మోహన్‌ను తనను కాపాడాడని తెలిపింది. ఈ విషయమై తలుపుల ఎస్‌ఐ చంద్రశేఖర్ వివరణ కోరగా... బాధితురాలు సుగుణ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. ఆ సమయంలో మోహన్ అనే వ్యక్తి ఆమెను కాపాడి ఆస్పత్రికి తీసుకొచ్చాడన్నారు.
ప్రేమికుల కథ అడ్డం తిరిగింది!
Published Thu, May 25 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
Advertisement
Advertisement