సాక్షి,సిటీ బ్యూరో: మహానగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.. సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో రీఫిల్ నిర్ణీత ధరకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. వినియోగదారులు సిలిండర్ ధరపై డెలివరీ బాయ్స్‌కు అదనపు చెల్లించేది చిల్లర రూపాయిలు కదా.. అనుకొని తేలికగా తీసుకుటుండంతో అది కాస్తా డిమాండ్‌గా మారింది. ఫలితంగా అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.667.50 ఉండగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690లు. అంటే నిర్ణీత ధర కంటే రూ.22.50 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇందు కోసమే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బిల్లుల వసూళ్లలో స్వైపింగ్ మిషన్ జోలికి వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు తూట్లు
గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. రీఫిల్ డోర్ డెలివరీ భారాన్ని డెలివరి బాయ్స్‌పై వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ఎల్పీజీ వంట గ్యాస్ నిర్ణీత ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్ధేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉండగా కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తున్నారు, మరికొందరు సిలిండర్ డెలివరీపై కమీషన్ మాత్రమే ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధన ప్రకారం బాయ్స్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాలి. అయితే ఈ విధానం ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కానరావడం లేదు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్నా.. నిబంధనలను డెలివరీ బాయ్స్ మరిచి పోయారు.
నిబంధనలివీ.
వినియోగదారుడు ఆన్‌లైన్‌లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ చేసి డోర్ డెలివరీ చేయాలి
ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలవరీ ఇవ్వాలి.
ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణ చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి.
16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీలు పేరిట రూ. 15 వసూలు చేయాలి
వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి,
గ్రేటర్‌లో
వంటగ్యాస్ వినియోగదారులు ః 29.18 లక్షలు
ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు ః 115
ప్రతిరోజు గ్యాస్ బుకింగ్ ః 80 వేలు
ప్రతిరోజు సిలిండర్ సరఫరా ః 60 వేలు
డెలివరీ బాయ్స్ ః 1150
ప్రస్తుతం వంటగ్యాస్ నిర్ణీత ధర ః రూ. 667.50
వినియోగదారుడు చెల్లించాల్సింది ః రూ. 667.50
డెలివరీ బాయ్స్ వసూలు చేస్తోంది ః రూ. 690
వినియోగదారుడిపై అదనపు భారం ః రూ.22.50
బండ బాదుడు
Published Wed, Jan 18 2017 2:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
Advertisement
Advertisement