బలుసులమ్మకు మహా నివేదన
బలుసులమ్మకు మహా నివేదన
Published Sat, Apr 8 2017 12:57 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
తాడేపల్లిగూడెం : గ్రామదేవత బలుసులమ్మ తల్లి ఆలయ పున:ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అమ్మవారికి మహాకుంభ నివేదన కార్యక్రమం జరిపారు. వారం రోజులుగా క్రతువులు, యాగాలు, ఆ«ధ్యాత్మిక ప్రవచనాలతో అమ్మవారి ఆలయంలో కార్యక్రమాలు ఘనంగా సాగాయి. దివ్యమంగళ రూపంలో నూతన ఆలయంలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రతిష్ఠామూర్తి, శ్రీచక్రానికి పూజాధికాలు నిర్వహిచారు. మహాకుంభనివేదనతో అమ్మను శాంతమూర్తిగా చేశారు. పులిహోర, బూరెలు, గారెలతో అమ్మ ప్రతిరూపాన్ని తయారు చేసి భక్తిని చాటుకున్నారు. బూందీ, తొక్కుడు లడ్డూలు, జాంగ్రీలు. మైసూర్‌పాక్‌లు వంటి స్వీట్లను అమ్మకు నైవేద్యంగా నివేదించారు. అనంతరం జరిగిన భారీ అన్న సమారాధనలో భక్తులకు వీటిని వడ్డించి అమ్మ అనుగ్రహంను అందించారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు. మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ భాధ్యులు శ్రీరంగం అంజి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమ్మ ఆవహించెను
బలుసులమ్మ ఆవహించడంతో ఒక మహిళ నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించారు. పెద్దగా హావభావాలను ప్రదర్శిస్తూ శ్రీచక్రంపై ఉన్న కుంకుమను చేతితో తీసుకొని, అదే సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి మాణిక్యాలరావు నుదుటిన దిద్దింది. ఇదే సమయంలో మరికొంత మంది మహిళలు అమ్మ ఆవహించడంతో కాస్త హడావుడి చేశారు. శుక్రవారం మహానివేదనతో బలుసులమ్మ ఆలయ పున:ప్రతిష్ఠ కార్యక్రమాలు ముగిశాయి.
Advertisement