
పంటలు ఎండుతుంటే... పండగంటారా?
రాజాపూర్: వర్షాభావంతో పంటలు పండక రైతులు ఓ వైపు ఆందోళన చెందుతుంటే, పండుగలు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు అనడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎండిన పంటలు పరిశీలించడానికి మంత్రి హరీశ్‌రావు నిజనిర్ధారణకు రావాలన్నారు. కేవలం సీఎం కేసీఆర్ సంతోషించడానికే.. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అని హరీశ్‌రావును ప్రశ్నించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులోకి తేవడంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదివారని పేర్కొన్నారు. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. ధ్రువపత్రాల కోసం విద్యార్థులు కళాశాలకు వెళితే ఇబ్బందులు పెడుతున్నారని గుర్తుచేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు, అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డుకాదన్నారు. 31 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు అడిగారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జిల్లాలు ఏర్పాటు చేయడం కాదు, ఆయా జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా మల్లు రవి డిమాండ్ చేశారు.