రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు
-
పుణె నుంచి తిరిగొచ్చిన మరుసటిరోజే ఘటన
-
గుబ్బడిగుచ్చతండాలో విషాదఛాయలు
స్థానికంగా ఉపాధి కరువైన అతను పొట్టకూటికోసం కుటుంబ సభ్యులతో కలిసి వేరే రాష్ట్రానికి వలస వెళ్లాడు.. కాగా, శ్రావణమాస పూజల్లో భాగంగా స్వగ్రామానికి తిరిగి వచ్చిన మరుసటిరోజే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.. ఈ సంఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నవాబుపేట : రేకులచౌడాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గుబ్బడిగుచ్చతండాకు చెందిన బదావత్ రవినాయక్ (38) కి భార్యలు మారు, యాదమ్మతోపాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితమే ఇద్దరు భార్యలతో కలిసి మహారాష్ట్రలోని పుణెకు వలస వెళ్లాడు. తమ పిల్లలను మాత్రం తండాలోని తమ్ముడు గోపి వద్దే ఉంచాడు. కాగా, శ్రావణమాసం సందర్భంగా ఈనెల 26న స్వగ్రామానికి వచ్చి మరుసటిరోజు స్థానికంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అదే అర్ధరాత్రి ఇంటికి చేరుకుని దుస్తులను దండెపై వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఇద్దరు భార్యలు స్వగ్రామానికి చేరుకుని బోరుమన్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలాఉండగా తండాలో నెల రోజులుగా తరచూ ఇళ్లలో షాక్ వస్తోందని గిరిజనులు ఆరోపించారు. సెల్ చార్జింగ్ పెట్టేప్పుడు, ఫ్యాన్ స్విచ్‌లు వేయాలంటేనే ఆందోళనకు గురవుతున్నామన్నారు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎర్తింగ్ సమస్య వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు.
28జడ్‌సీఎల్402 :