
నమ్మించి స్నేహం, అశ్లీల ఫోటోలతో వేధింపులు
- అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిలింగ్
- పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతులు
- కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
విశాఖ : అందమైన అమ్మాయిలతో మాటలు కలిపి నమ్మించి స్నేహం పెంచుకుంటాడు... అనంతరం వారితో చనువుగా ఉన్న సమయంలో ఫొటోలు తీస్తాడు... వాటిని ఆసరాగా చేసుకుని కోరిక తీర్చమని బ్లాక్‌మెయిలింగ్ చేస్తాడు... ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా సుమారు 30 మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడు మద్దిలపాలెంకు చెందిన నయవంచకుడు నితిన్. బీటెక్ చదువుతున్నానని, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యానని, త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించి పలువురు అమ్మాయిలతో స్నేహం పెంచుకుని మోసం చేశాడు. అశ్లీల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి లోబరుచుకున్నాడని కొందరు యువతులు కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...
మద్దిలపాలెంలో ఉంటున్న నితిన్ తన స్నేహితుని సాయంతో కంచరపాలెం స్టేషన్ పరిధిలో ఉన్న ఎలుకల గాయత్రి ఫోన్ నంబర్ సేకరించి స్నేహం పెంచుకున్నాడు. గాయత్రికి సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి తాను షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తానని, వాటిలో అవకాశాలు కల్పిస్తానని నమ్మించాడు. అందుకోసం మంచి ఫొటోలు తీయించుకోవాలని చెప్పాడు. దీంతో సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఫొటోలు తీయించుకునేందుకు గాయత్రి అంగీకరించింది. అయితే ఫొటోలు తీయించుకునే సమయంలోను, దుస్తులు మార్చుకునేటపుడు అశ్లీల ఫొటోలు తీసిన నితిన్ అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.
తన కోరిక తీరిస్తేనే ఫొటోలు ఇస్తానని చెప్పి గాయత్రిని లోబరుచుకున్నాడు. ఇలా మరో అమ్మాయి ప్రియను కూడా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి కూడా చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా రోజా అనే అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రాత్రి సమయంలో వీడియో కాల్ చేయాలని రోజూ వేధిస్తుండేవాడని ఆ యువతి వాపోయింది. ఇలా సుమారు 30 మంది యువతులను నితిన్ వేధించాడని పోలీసులు, బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని సీఐ చంద్రశేఖరరావు తెలిపారు.