జమ్మికుంట/చేవెళ్ల: కుటుంబ సభ్యులంతా ఆదివారం సరదాగా గడపాలని అనుకున్నారు. ఓ ఫాంహౌస్‌లో గెట్ టు గెదర్ పార్టీ ఉండడంతో వారి కారులో బయలుదేరారు. ఈ ప్రయాణం కాస్త విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన హైతా యుగేందర్, అనురాధ దంపతులు. హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. చేవెళ్ల సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో ఆత్మీయ సమ్మేళనం ఉండడంతో యుగేందర్ దంపతులు, వారి పెద్ద కుమారుడు శరణ్, కోడలు సంఘవి, చిన్న కుమారుడు నితిన్ (27) కారులో ప్రయాణమయ్యారు.
నితిన్ కారు డ్రైవ్ చేస్తుండగా, చేవెళ్ల మండల కేంద్రానికి సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నితిన్ తలకు బలమైన గాయమవగా, కారులో ప్రయాణిస్తున్న వారి కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నితిన్ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
చేతికి వచ్చిన కొడుకు వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఈ ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నితిన్ మృతితో జమ్మికుంటలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment