అనుమానం పెనుభూతం
అనుమానం పెనుభూతం
Published Fri, Apr 7 2017 11:33 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
భార్యను చంపి, భర్త ఆత్మహత్య
కాకినాడ రూరల్ : అనుమానం పెనుభూతంగా మారడంతో భార్యను చంపి తాను ఉరివేసుకొని చనిపోయిన సంఘటన కాకినాడ రూరల్ మండలం తమ్మవరం పంచాయతీ పోలవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన పినపోతుల రవి (26)కి పోలవరం గ్రామానికి చెందిన భూలక్షి్మతో 2015లో వివాహమైంది. వీరికి 14 నెలల పాప ఉంది. భూలక్ష్మి ప్రస్తుతం ఏడు నెలలు గర్భిణి. ఏడాదిగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య భూలక్ష్మిపై రవి అనుమానంతో గొడవ పడుతున్నాడు. ఇరవై రోజుల క్రితం ఏటిమొగ నుంచి కొందరు పెద్దలు వచ్చి భార్యాభర్తల మధ్య తగవు తీర్చి కాపురాన్ని చక్కదిద్దారు. కొన్ని రోజులు బాగానే ఉన్న వారు శుక్రవారం ఉదయం మళ్లీ ఘర్షణ పడ్డారు. ఏం జరిగిందో ఇద్దరు శవాలై ఉండడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మృతుడు రవి హార్బర్‌పేటలో కోళ్ల మేతకు, రొయ్యల చెరువులకు ఉపయోగించే చేపల గుండ తయారు చేసే పనులు చేస్తుం టాడని స్థానికులు తెలిపారు. భూలక్ష్మి అన్న ప్రసాద్ పక్క గదిలోనే ఉంటున్నాడు. ఇతను పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ నుంచి తమ్మవరం ఎస్సీపేటలో స్నేహితుని పెండ్లికి వెళ్లేం దుకు గిఫ్టు తీసుకొని ఇంటికొచ్చాడు. ఇంటికి వచ్చే సరికి చెల్లెలు కుమార్తె పెద్దగా ఏడుస్తోంది. తలుపులు తీసి చూసే సరికి బావ రవి ఇంట్లో ఫ్యాన్ హుక్కుకి ఉరేసుకొని కన్పించాడు. వెంటనే ఆ మార్గం గుండా వెళ్తున్న వ్యక్తుల సాయంతో కిందికి దింపగా అప్పటికే రవి మరణించాడు. అదే గదిలో మంచం కింద తన చెల్లెలు శవమై కనిపిం చింది. భూలక్షి్మని రవి ముందుగా గొంతు వస్త్రంతో బిగించి చంపేసి మంచం కింద పెట్టేసి, తాను భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ వి.పవన్‌కిశోర్, తిమ్మాపురం ఎస్సై బి.తిరుపతిరావుతో పాటు ట్రైనీ ఎస్పీ అజితా వెజెందలా తదితరులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తిమ్మాపురం పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement