మృతి చెందాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
మృతి చెందాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
Published Sun, Sep 18 2016 7:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
గన్ ఫౌండ్రి(హైదరాబాద్): ఆ ఇంటి పెద్ద చనిపోయాడు. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. మృతదేహానికి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. తెల్లారితే దశదిన కర్మ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో చనిపోయాడకున్న వ్యక్తి అనూహ్యంగా బతికొచ్చాడు. సినిమా కథను తలపిస్తున్నా ఈ సంఘటన శనివారం గోల్నాక ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట్ గోల్నాక హనుమాన్ నగర్‌కు చెందిన అంజయ్య (50) మలక్‌పేట్‌లోని చాందినీ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తుంటాడు. మద్యం అలవాటున్న అంజయ్య ఈనెల 1న ఫంక్షన్ హాల్‌కు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు.
ఆ రోజు అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సరోజ, కుమారుడు సాయి, కుమార్తె స్వప్న ఆందోళనకు గురయ్యారు. ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేశారు. అంజయ్య ఫొటోను చూపిస్తూ పలు ప్రాంతాల్లో వెతకసాగారు. ఇదిలావుండగా.. ఈనెల 1వ తేదీన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గాయాలతో ఉన్న 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ వ్యక్తి మత్తు దిగగానే వైద్యులకు చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఇదే వ్యక్తి మద్యం తాగి ఎంజీబీఎస్ వద్ద అపస్మారక స్థితిలో పడివుండగా పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. రెండోసారి కూడా మత్తు దిగగానే తిరిగి వెళ్లిపోయాడు.
ఇదిలావుండగా, సుమారు అదే వయసున్న గుర్తు తెలియని వ్యక్తి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషషన్ పరిధిలోని రాష్ట్ర గ్రంథాలయం ముందు గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించి చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ నేపథ్యంలో అంజయ్యను వెదికి పెట్టాలని అతడి కొడుకు ఫొటోతో మీర్‌పేట్ పోలీస్ స్టేషషన్లో ఫిర్యాదు చేశాడు. అంజయ్య ఫొటోను చూసిన పోలీసులు గాయపడ్డ అతడిని ఉస్మానియాలో చేర్పించినట్లు చెప్పారు.
దీంతో అంజయ్య కుటుంబ సభ్యలు ఆస్పత్రికి చేరుకుని అఫ్జల్‌గంజ్ పోలీసులు ఈనెల 4న వైద్యం కోసం చేర్పించిన వ్యక్తిని తమ తండ్రిగా భావించి మూడు రోజుల పాటు సపర్యలు చేయగా ఈనెల 8న ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈమేరకు అఫ్జల్‌గంజ్ పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు సైతం చేసేశారు. ఆదివారం అంజయ్యకు దశదిన కర్మ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో అతడు బతికే ఉన్నాడన్న సమాచారం అందడంతో కుటుంబమంతా ఆశ్చర్యపోయారు.
అంజయ్యను గుర్తించింది ఇలా..
పదిహేడు రోజుల క్రితం అదృశ్యమైన అంజయ్య శనివారం బడీచౌడీలోని కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయలు అమ్మే మంజుల అనే మహిళకు తారసపడ్డారు. అతడిని గుర్తించిన ఆమె అంజయ్య బంధువులకు సమాచారం అందించింది. అంజయ్య బతికే ఉన్నాడని, తాను చూసినట్టు గట్టిగా చెప్పడంతో అవతలివారు నమ్మి అక్కడకు చేరుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడకున్న అంజయ్య బతికే ఉన్నాడని ఆనందంలో విషయాన్ని అఫ్జల్‌గంజ్ పోలీసులకు చేరవేశారు. అయితే, ఇప్పుడు అంజయ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మిగిలింది.
Advertisement