
పెళ్లాడి.. వదిలేశాడు!
తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఖమ్మం జిల్లాకు చెందిన జోగి యశోద మహిళా సంఘ నాయకులతో కలసి సోమవారం ఓ వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగింది
ఎచ్చెర్ల క్యాంపస్ : తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఖమ్మం జిల్లాకు చెందిన జోగి యశోద మహిళా సంఘ నాయకులతో కలసి సోమవారం ఓ వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన జోగి యశోదకు.. అశోక్ అనే యువకుడితో 2015లో ఫోన్‌లో పరిచయమైంది. ఆ తర్వాత విశాఖపట్నంలో ఇద్దరూ తరచూ కలుసుకొనేవారు. అదే ఏడాది విశాఖలో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగా కాపురం చేశాక.. అశోక్ తప్పించుకుని తిరుగుతున్నాడని యశోద ఆరోపణ.
ప్రస్తుతం అశోక్ చిలకపాలెంలోని మేనకా వైన్‌షాపులో పని చేస్తున్నాడు. సమీపంలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న యశోద.. విశాఖపట్నంలోని మహిళా సంఘాల నాయకులు జీవీఎల్‌పద్మ, సుహాసినితో కలసి సోమవారం చిలకపాలెం వచ్చింది. అశోక్ నివాసం ఉంటున్న ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. అయితే, ఆ యువకుడు మాత్రం తనకు యశోద ఎవరో తెలియదని అంటున్నాడు. యువతి వద్ద వివాహానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లేవు. తనకు న్యాయం జరి గే వరకూ పోరాటం చేస్తానని ఆమె చెబుతోంది. దీనిపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం లేదని మహిళా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.