
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులో నూరున్నిసా(29) అనే వివాహిత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వైజాగ్ ఎం.వి.పి కాలనీలో నివసించే కుదావన్, ఖాజాబిల మొదటి సంతానమైన నూరున్నిసాను పట్టణంలోని హుసేన్‌బాషా,, హుసేన్‌బీల మూడవ కుమారుడైన తొగరిగుంట కరిముల్లాకు ఇచ్చి ఏడేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల హబీబా అనే అమ్మాయి , కరామత్ అనే మూడేళ్ల బాలుడు ఉన్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం పిల్లలు చదువుకునే స్కూల్‌కు వెళ్లి భోజనం తినిపించి వచ్చిన నూరున్నిసా మేడపై గదిని శుభ్రం చేసేందుకు వెళ్తున్నానని అత్తతో చెప్పి వెళ్లింది. సాయంత్రం బడి ముగించుకుని ఇంటికి వచ్చిన కుమార్తె హబీబా మేడపైకి వెళ్లి తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా గడియపెట్టి ఉండడంతో కిటికిలోనుంచి చూసేసరికి నూరున్నిసా ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించింది. వెంటనే చిన్నారి నాన్నమ్మకు విషయం తెలపడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపు పగులగొట్టి మృతదేహన్ని కిందకు తీశారు. విషయం తెలుసుకున్న సీఐ రామాంజినాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని తెలిపారు.