యాంత్రీకరణతో సాగు బాగు
యాంత్రీకరణతో సాగు బాగు
Published Mon, Mar 13 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
- మార్టేరు వరిపరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ
కరప (కాకినాడరూరల్): సాగు ఖర్చు తగ్గించి, అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని మార్టేరు వరి పరిశోధనా కేంద్రం డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. కరప మండలం నడకుదురులోని ఏరువాక కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లా సమన్వయ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులకు కొత్త వరి వంగడాలు అందించేందుకు మార్టేరు వరి పరిశోధనా కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారని తెలిపారు. యాంత్రీకరణతో, వెదజల్లులోని యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గి, దిగుబడులు పెరుగుతాయని ఏరువాక కేంద్రం ప్రదర్శనా క్షేత్రాల ద్వారా రైతులకు తెలియచెప్పాలని సూచించారు. కోత, నాటే యంత్రాల వినియోగాన్ని కూడా రైతులు అలవాటు చేసుకోవాలని చెప్పారు. లాభసాటికాని పంటలను గుర్తించి వాటికి ప్రత్యామ్నాయంగా ఏమిచేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందో మార్టేరు శాస్త్రవేత్తలతో చర్చించి, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. వివిధ పంటల సాగులో అనుసరిస్తున్న పద్ధతులు రైతులను అడిగితెలుసుకుని, ఏమి చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న దానిపై సమీక్షించారు. ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పీఎల్‌ఆర్జే ప్రవీణ, గతయేడాది అమలు చేసిన వివిధ పథకాలు, పరిశోధనలు, వచ్చేయేడాది అమలుచేసే కార్యాచరణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గతయేడాది ఉత్తమ ఏరువాక కేంద్రం అవార్డు వచ్చినందుకు డాక్టర్ ప్రవీణను డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అభినందించారు. వి«విధ శాఖల అధికారులు మాట్లాడుతూ రైతులు ప్రయోజనం పొందాలంటే తమ శాఖల ద్వారా అనుసరించాల్సిన పద్ధతులను వివరించారు. నాబార్డు ఏజీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు కేవీఎస్ ప్రసాద్, ఉద్యాన శాఖ ఏడీ కె.గోపికుమార్, ఏపీఎంఐపీ పీడీ టీవీ సుబ్బారావు, వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీటీ రామారావు, మార్టేరు వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ జే కృష్ణప్రసాద్ (తెగుళ్ల విభాగం), డాక్టర్ ఎన్.చాముండేశ్వరి(బ్రీడింగ్), డాక్టర్ పి.ఆనంద్‌కుమార్(సస్యరక్షణ), డాక్టర్ ఎం.శ్రీనివాస్(ఆగ్రానమీ), ఏరువాక కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.నందకిశోర్, డాక్టర్ సి.వెంకటరెడ్డి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహాసంఘం సభ్యుడు చుండ్రు వీరవెంకట వరప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement