చూ’ఛీ’రాతలు
చూ’ఛీ’రాతలు
Published Wed, Mar 22 2017 10:55 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
సమ్మెటివ్3 పరీక్షల్లోనూ మాస్‌కాపీయింగ్
మార్కుల కోసం అడ్డదారి తొక్కుతున్న ప్రైవేటు విద్యాసంస్థలు
9వ తరగతి గణితం పేపర్2 లీక్
ప్రతిభకు పాతర
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
పట్టించుకోని విద్యాశాఖ
’మాకున్నది ఒకే అమ్మాయి. ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదివిస్తున్నాం. సమ్మెటివ్ పరీక్షలను చాలా జాగ్రత్తగా.. ఎటువంటి అవకతవకలు లేకుండా జరిపిస్తామని, జవాబు పత్రాలను వేరే ఉపాధ్యాయులతో దిద్దిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ, ప్రైవేటు పాఠశాలల్లో కాపీలు రాయిస్తూ.. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేస్తున్నారు. ఎంతగా దిగజారారంటే.. తరగతి గదిలోనే పుస్తకాలను ఉంచి.. పిల్లలకు స్లిప్పులు ఇచ్చి రాయిస్తున్నారు. క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలను అరగంట ముందే విద్యార్థులకు చెప్పేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలామంది పిల్లలు ఇంటివద్ద చదవటం లేదు. దీనివల్ల వారికి పాఠ్యాంశాలు అబ్బటం లేదు. బాగా చదివే వారికి.. అస్సలు చదవని వారికి ఒకే రకంగా మార్కులు వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల్ని ఇలా పెడదారి పట్టించడం న్యాయమా. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నా.. అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు ఉంటున్నారు. ఉన్నతాధికారులు దీనికి ఏం సమాధానం చెబుతారు’ నిడదవోలు పట్టణానికి చెందిన ఎస్.విజయలక్ష్మి అనే మహిళ పత్రికా కార్యాలయాలకు బుధవారం పంపించిన లేఖలోని ఆవేదన ఇది. జిల్లాలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సమ్మెటివ్3 పరీక్షలు ఎంత గొప్పగా సాగుతున్నాయో చెప్పడానికి ఇదొక్కటి చాలు.
ఏలూరు సిటీ :
విద్యావ్యవస్థలో నూతన విధానాలను సైతం కొన్ని విద్యాసంస్థలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని విద్యార్థులందరికీ ’సమ్మెటివ్’ పేరిట ప్రభుత్వం ఏకరూప పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టింది. త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల స్థానంలో సమ్మెటివ్1, సమ్మెటివ్2 పరీక్షలు నిర్వహించింది. తాజాగా, సమ్మెటివ్3 పేరిట వార్షిక పరీక్షలు నిర్వహిస్తోంది. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు అక్కడక్కడా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం చూసిరాతలను ప్రోత్సహిస్తున్నారు.
అంగట్లో ప్రశ్నపత్రాలు
సమ్మెటివ్3 పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. బుధవారం జరగాల్సిన 9వ తరగతి సమ్మెటివ్3 గణితం పేపర్2 ప్రశ్నపత్రం మంగళవారం రాత్రే అంగట్లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని ’సమ్మెటివ్3 గణితం పేపర్ లీక్’ శీర్షికన బుధవారం సంచికలో ’సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. బుధవారం మధ్యాహ్నం పరీక్షకు అర్ధగంట ముందు గణితం పేపర్2 పరీక్ష ప్రశపత్రాన్ని తెరిచిన ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. పేపర్ లీక్ కావటంతో ప్రశ్నపత్రాన్ని మారుస్తారని, లేదా పరీక్షను వాయిదా వేస్తారని భావించగా, పరీక్ష యథావిధిగా జరిగిపోయింది. ఈ మాత్రం దానికి ప్రశ్నపత్రాలు హైదరాబాద్‌లో రహస్యంగా ముద్రించటం ఎందుకు.. పబ్లిక్ పరీక్షల స్థాయిలో హడావుడి చేయటం ఎందుకు, ప్రశ్నపత్రం లీక్ అయ్యిందనే విషయం తెలిసినా రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు కనీసం విచారణ కూడా చేపట్టకపోవటం ఏమిటనే ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ ప్రశ్నపత్రం విశాఖపట్నం నుంచి జిల్లాకు వచ్చిందని.. నరసాపురం కేంద్రంగా జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలకు దాని కాపీలను చేరవేశారని సమాచారం.
యథేచ్ఛగా చూసిరాతలు
జిల్లాలోని చాలా పాఠశాలల్లో మాస్‌కాపీయింగ్‌ను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారు. 6నుంచి 8వ తరగది వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, లెక్కలు పరీక్షలు పూర్తయ్యాయి. 9వ తరగతి విద్యార్థులకు బుధవారం నాటితో లెక్కలు పరీక్ష పూర్తయ్యింది. ఈ పరీక్షల్లో లెక్కలు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి చూసిరాతలను పెద్దఎత్తున నిర్వహించారు. సైన్స్ ప్రశ్నపత్రాలు కూడా ముందస్తుగానే బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. చూసిరాతల వ్యవహారం 6, 7 తరగతుల విద్యార్థుల విషయంలో పెద్దగా లేకపోయినా.. 8, 9 తరగతుల్లో సాగుతోంది. ఆ రెండు తరగతుల్లో విద్యార్థులకు వచ్చే మార్కుల ఆధారంగా పదో తరగతిలో గ్రేస్ మార్కులు కలపడానికి అవకాశం ఉండటంతో చూసిరాత పేరిట విద్యార్థులను పెడదారి పట్టిస్తున్నారు.
జిల్లాలో లీక్ కాలేదు
9వ తరగతి సమ్మెటివ్3 గణితం పేపర్2 ప్రశ్నపత్రం జిల్లాలో లీక్ కాలేదు. బయట జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరో తెచ్చి ఉంటారు. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సమాచారం ఇచ్చాం. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. రాష్ట్రమంతా ఒకే ప్రశ్నపత్రాన్ని ముద్రించడం వల్ల లీక్ అయిన పేపర్‌కు బదులు మరో పేపర్ ఇచ్చే అవకాశం లేకుండాపోయింది.
ఆర్‌ఎస్ గంగాభవాని, డీఈఓ, ఏలూరు
Advertisement
Advertisement