విద్యా వ్యవస్థలో లోటుపాట్లను సరిచేస్తాం
► ప్రతి పాఠశాలలో ఫిజికల్ లిటరసీ పిరియడ్
► డీఎస్సీ ద్వారా కూచిపూడి, భరతనాట్యం అధ్యాపకుల నియామకం
► రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్-2016 ప్రారంభ్సోవంలో మంత్రి గంటా వెల్లడి
విజయవాడ (గుణదల) : విద్యార్థులకు నైతిక విలువలు కలిగిన విద్యను అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు విద్యా నైపుణ్యాలతోపాటు ఫిజికల్ లిటరసీని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గుణదలలోని బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్-2016ను బుధవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య అనేది జీవితమని.. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోటుపాట్లను సరిచేసి నూతన విద్యావిధానాన్ని అందించేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పిల్లల్లో సృజనాత్మకత, అకడమిక్ స్కిల్స్(విద్యా నైపుణ్యాలు)ను పెంచటానికి ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ఫిజికల్ లిటరసీ ఏర్పాటు చేసి, ఒక పిరియడ్‌ను కేటాయిస్తామన్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి కళలపై మక్కువను పెంచటానికి కళా సంస్కృతి విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో బడ్జెట్ కేటాయించామని, ఆ విభాగానికి కూచిబొట్ల ఆనంద్‌ను చైర్మన్‌గా నియమించామని తెలిపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భాగస్వాములను చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ అధికారిక కార్యక్రమాల్లో కూచిపూడి, భరతనాట్యం వంటి కళలను ఏర్పాటు చేసి, విద్యార్థులను ప్రోత్సహిస్తామని వివరించారు. త్వరలో డీఎస్సీ ద్వారా కూచిపూడి, భరతనాట్యం అధ్యాపకులను కూడా నియమిస్తామని తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్మర్ గద్దె అనూరాధ మాట్లాడుతూ కళల ద్వారా విద్యార్థులకు ఉత్తిడి దూరమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, నగర మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి సత్యనారాయణ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభయాన్ డెరైక్టర్ డాక్టర్ ప్రభాకరరావు, రాష్ట్ర సాంస్కృతిక విభాగం రిసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎస్‌ఈఆర్‌ఈటీ డెరైక్టర్ ఎం.రాజ్యలక్ష్మీ, డీఈవో ఎ.సుబ్బారెడ్డి, డీవైఈవోలు రవికుమార్, రవిసాగర్, గిరికుమార్, స్థానిక కార్పొరేటర్ దాసరి మల్లేశ్వరి పాల్గొన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.