మత్తడిలో గల్లంతైన మృతదేహం లభ్యం
Published Thu, Oct 6 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
నర్సంపేటరూరల్ : మాధన్నపేట మత్తడిలో ఇటీవల గల్లంతైన వ్యక్తి మృతదేహం సమీపంలోని బండరాళ్ల మధ్య చిక్కుకొని బుధవారం కనిపించింది. మండలంలోని మాధన్నపేట చెరువు మత్తడి పోస్తుండగా చేపల పడుతున్న బల్సూకూరి కృష్ణ(28) సెప్టెంబర్ 23న ప్రమాదవశాత్తూ కాలుజారిపడి గల్లంతైన విషయం తెలిసిందే.
దీంతో స్థానికులు, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. మత్తడి పోయడం ఆగిపోవడంతో స్థానిక రైతులు అటువైపుగా వెళ్తుండగా బుధవారం మధ్యాహ్నం కృష్ణ మృతదేహం కనిపించింది. దీంతో సీఐ జాన్‌దివాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం బండరాళ్ల మధ్య చిక్కుకోవడంతో బయటకు తేలలేదని సీఐ తెలిపారు. అప్పటికే మృతదేహం మొత్తం అస్తిపంజరంగా మారడంతో మృతదేహానికి పంచానామా నిర్వహించామని సీఐ తెలిపారు. మృతుడుకి భార్య సరోజన, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.
కుటుంబ సభ్యుల రోదనలు...
పద మూడు రోజుల తర్వాత కృష్ణ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బండరాళ్ల ఉన్న కృష్ణ మృతదేహాన్ని చూసి వారు రోదించిన తీరు పలువురిని కలిచివేసింది. కృష్ణ మృతదేహం లభ్యం కావడంతో మాధన్నపేట, నాగురపల్లి, కమలాపురం, ముత్తోజిపేట గ్రామాలకు చెందిన ప్రజలు మత్తడి వద్దకు తరలివచ్చారు.
Advertisement
Advertisement