లూప్‌లైన్‌లోనే మెట్రో
⇒ రైలు కోసం అధికారుల అగచాట్లు!
⇒ భూసేకరణ ప్రారంభమే కాలేదు
⇒ విదేశీ నిధులు మంజూరు చేయలేదు
⇒ టెండర్లే అసలు ఖరారు కాలేదు
⇒ అయినా ప్రత్యామ్నాయ రోడ్ల కోసం చర్యలు
సాక్షి, విజయవాడ : విజయవాడ నగరంలో మెట్రో రైలును పట్టాలు ఎక్కించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ)ప్రాజెక్టు అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా... అడ్డం కులు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో ఒకేసారి మెట్రో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే నగర వాసులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కలెక్టర్ బాబు.ఎ కసరత్తు ప్రారంభించారు. దీని కోసం అవసరమైన పనులను చేపట్టాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాస్తవంగా పరిశీలిస్తే అధికారులు చేస్తున్న హడావుడికి, ప్రాజెక్టు ముందుకు సాగుతున్న తీరుకు ఏ మాత్రం పొంతన కనపడటం లేదు. ప్రాజెక్టు అమలుకు కావాల్సిన అడ్డంకులను తొలగించుకోకుండా అధికారులు హడావుడి చేయడం సరికాదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ సంస్థలు నిధుల కోసం ఎదురు చూపులు
ఏఎంఆర్‌సీ ప్రాజెక్టు ఎంతమేరకు లాభదాయకమనే అంశంపై జర్మనీ, ప్రాన్స్ సంస్థలకు అంచనాలు వేస్తున్నాయి. ఇటీవల అధికారులు వచ్చి రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినా నిధులు విడుదలలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో నిధులు రావడంలో జాప్యం జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా పరిపాలన పరమైన అనుమతులు రాలేదు. కేంద్రం తన వాటా నిధులను విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు పూర్తిగా విడుదల కాలేదు. ఈ నేథ్యంలో మెట్రో ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల కోసం అధికారులు ఇంకా వెతుకులాట దశలోనే ఉన్నారు. ఇక ప్రాజెక్టు పనులు చేపట్టడానికి కావాల్సిన టెండర్లు ఖరారు చేయలేదు. ఇప్పటి వరకు కేవలం టెక్నికల్ బిడ్‌లను మాత్రమే తెరిచారు. ఇంకా ఫైనాన్సియల్ బిడ్ తెరిచి అర్హులైన వారికి టెండర్లు ఖరారు చేయాల్సి ఉంది.
ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు
కీలకమైన దశలు దాటకుండానే జిల్లా అధికారులు, ఏఎంఆర్‌సీ అధికారులు ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏఏ చర్యలు తీసుకోవాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల మీదగా వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండా చూసేందుకు ప్రత్నామాయం ఆలోచిస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్, చెన్నై వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో అంతర్గత రోడ్లపైన దృష్టి పెట్టారు. వీటి కోసం ప్రస్తుతం ఉన్న వంతెనలు, కల్వర్టులకు మరమ్మతులు చేయడం, కొత్త రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట కొత్త సబ్‌వేలు నిర్మించడం వంటి పనులు చేస్తున్నారు. దీని కోసం అన్ని శాఖల అధికారులతోనూ రెవెన్యూ, ఏఎంఆర్‌సీ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భూసేకరణపై ప్రజల అభ్యంతరాలు
ఏలూరు రోడ్డులో భూములు కోల్పోతున్న వారు మెట్రో రైలు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా నష్టమని, ఇందులో పెట్టుబడులు పెడితే తిరిగి రావడం అసాధ్యమని కొంతమంది బాధితులు మెట్రో ప్రాజెక్టుకు రుణాలు ఇవ్వనున్న జర్మనీ, ఫ్రాన్స్‌కు చెందిన రుణ సంస్థలకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు డిజైన్లు మార్చాలంటూ నిబంధనలు పెట్టాలని రుణ సంస్థలకు సూచిం చారు. బీఆర్‌టీఎస్ రోడ్డు, కాలువలపైన మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని సూచిం చారు. ఇదే ప్రతిపాదనలపై జర్మనీ, ఫ్రాన్స్ సంస్థలు ఏఎంఆర్‌సీ వివరణ కోరాయి. డిజైన్లు మార్చడంలో గల ఇబ్బందులను ఏఎంఆర్‌సీ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాధితుల నుంచి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భూ సేకరణకు రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు.