సనపలో మధ్యాహ్న భోజనం బంద్
ఆత్మకూరు: మండల పరిధిలోని సనప ప్రాథమిక పాఠశాలలో వారం రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వాపోతున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు వారం రోజులగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చెయ్యలేదు. దీంతో విద్యార్థులు నిత్యం ఇళ్ల దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవడమో లేక ఇళ్లకు వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు పలు సార్లు తెలిపినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
గిట్టుబాటు కాలేదని వదిలేశారు : ఈ విషయంపై ఎంఈఓ నరసింహారెడ్డిని వివరణ కోరగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు గిట్టుబాటు కాకపోవడంతో వదిలేశారన్నారు. మధ్యలో రెండు రోజులపాటు ఇతరులచే భోజనాలు వడ్డించి విద్యార్థులకు అందచేశామని, ప్రస్తుతం మళ్లీ అదే సమస్య ఏర్పడిందన్నారు. సోమవారం ఈ సమస్యను పూర్తి పరిష్కారం కల్పిస్తామని ఎంపీడీఓ తెలిపారు. కాగా సనప ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఆదినారాయణను కలిసి తమ సమస్యను తెలియజేసినట్లు తెలిపారు.