దుబాయిలో వలసజీవి ఆత్మహత్మ
Published Wed, Jul 20 2016 10:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
బోయినపల్లి : బతుకుదెరువు కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశం వెళ్లిన వలసజీవికి అక్కడా కష్టాలు తప్పలేదు. సరైన పనిలేక, చాలీచాలని జీతంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎడపెల్లి అంజయ్య(44)కు ఎకరంన్నర భూమి ఉన్నా, సాగునీటి వసతి లేదు. చాలా సంవత్సరాలుగా భూమి బీడుగా ఉంటోంది. భార్యాభర్తలు ఇద్దరు కూలీకి వెళ్లి తమ కుటుంబాన్ని పోషించేవారు. ఎంతచేసినా ఇక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో అంజయ్య రూ.రెండు లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం దుబాయి వెళ్లాడు. అక్కడ చాలీచాలని జీతంతో లేబర్ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక్కడ అంజయ్య భార్య విజయ కూలీకి వెళ్తూ పిల్లలను చదివిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో అంజయ్య స్వగ్రామానికి వచ్చి పెద్ద కూతరు జ్యోతి వివాహం చేశాడు. వివాహ సమయంలో రూ.రెండు లక్షల వరకు అప్పు చేశాడు. రెండో కూతురు మనీష గంగాధరలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్న కూతురు శివాణి తొమ్మిదో తరగతి. ఇద్దరు కూతుళ్లు ఎదుగుతున్నారు... వారి చదువుల ఖర్చు, తదితర అవసరాలు ఎలా తీర్చాలి.. పైగా రూ.4లక్షల దాకా అప్పులున్నాయని మనస్తాపం చెందుతుండేవాడు. అప్పుడప్పుడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కూతుళ్లకు పెళ్లి ఎలా చేయాలని భార విజయతో వాపోయేవాడు. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన అంజయ్య ఈనెల 19న దుబాయిలోని తన గదిలో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడివారు ఫోన్ ద్వారా తెలియజేశారు. నాలుగు రాళ్లు వెనుకేసుకొస్తాడనుకున్న వ్యక్తి అందరినీ వదిలివెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Advertisement