పరిహారం కోసం ఎదురుచూపులు | wait for compenstation | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం ఎదురుచూపులు

Published Tue, Jul 26 2016 7:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

పరిహారం కోసం ఎదురుచూపులు - Sakshi

పరిహారం కోసం ఎదురుచూపులు

 

  • రైతు ఆత్మహత్య చేసుకుని మూడేళ్లు..
  • పరిహారం కోసం కార్యాలయం చుట్టు ప్రదక్షణలు
ధర్మారం :  భూమిని నమ్ముకుని లక్షల పెట్టుబడులు పెడుతున్న రైతులకు అప్పులే మిగులుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి కారణంగా పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలు ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయ పైరవీలు లేనిదే పని కావడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. 
 
ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన రుద్ర లచ్చయ్య–మమత దంపతులు తమకున్న ఎకరం వ్యవసాయ భూమితో పాటు మరో 9ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగుచేశారు. వ్యవసాయానికి వాతావరణం అనుకూలించకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల బాధలు అధికం కావడంతో వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో లచ్చయ్య 2013 మార్చి 30న క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతిని అధికారులు రైతు ఆత్మహత్యగా గుర్తించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. నివేదికను పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి పంపిస్తామని వారు చెప్పారు. పరిహారం అందించగానే అప్పులు చెల్లిస్తానని బాకీదారులతో మమత చెప్పుకొచ్చింది. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో మమత రెవెన్యూ కార్యాలయం బాటపట్టింది. దాదాపు ఆరు నెలలపాటు తిరిగిన మమతకు నివేదికను కలెక్టర్‌కు పంపించామని, అక్కడి నుంచి రావాలనే అధికారులు చెప్పడంతో ఆమె కార్యాలయానికి వెళ్లడం మానేసింది.
 
మరో ఘటనలో చకాచకా..
మండలంలోని బంజేరుపల్లి గ్రామానికి చెందిన నునావత్‌ రాంజీనాయక్‌ ఏడాది క్రితం  ఆత్మహత్య చేసుకోగా.. అధికారులు రైతు ఆత్మహత్యగా పరిగణించిన అధికారులు విచారణ జరిపారు. సంబంధిత ఫైల్‌ను తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్డీవో, అక్కడ నుంచి కలెక్టరేట్‌కు యుద్ధప్రాతిపదికన పంపించారు. ప్రభుత్వం ద్వారా నెల క్రితం రూ.5లక్షల పరిహారం ప్రభుత్వం బాధిత కుటుంబానికి అందించింది. అయితే రాంజీనాయక్‌ కుటుంబానికి రాజకీయ నాయకుడి అండ ఉండడంతో అధికారులతో సంప్రదించి నివేదిక ఫైల్‌ను ప్రభుత్వానికి అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సదరు రైతుకు ప్రభుత్వం సకాలంలో పరిహారం అందించింది. ఈ విషయం తెలుసుకున్న మమత తిరిగి రెవెన్యూ కార్యాలయానికి రావడం ప్రారంభించింది. దీంతో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఆమెకు సంబంధించిన ఫైల్‌పై ఆరా తీయగా.. అసలు ఆర్డీవో కార్యాలయానికి పంపించలేదని స్పష్టమైంది. దీంతో సదరు ఉద్యోగి చొరవతీసుకుని ఆ ఫైల్‌ను పరిశీలించి పెద్దపల్లి ఆర్‌డీఓ కార్యాలయానికి పంపించేలా చర్యలు తీసుకున్నారు. పెద్దపల్లి ఆర్‌డీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు పంపించినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ అండలేని మమత ఫైల్‌ ప్రభుత్వానికి ఎప్పుడు చేరుతుందో వేచిచూడాల్సిందే. భర్త ఆత్మహత్యతో మమత కూలీ పనికిపోతూ తన ఇద్దరు కూతుళ్లు, కొడుకును పోషిస్తోంది. ప్రస్తుతం ఉండడానికి కనీసం ఇళ్లుకూడా లేదని మమత  ఆవేదన వ్యక్తంచేస్తోం. ప్రభుత్వం పరిహారం అందిస్తే అప్పుల బాధ నుంచి విముక్తిపొంది పిల్లలను బాగా చదివిస్తానని అంటోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement